పుట:కాశీమజిలీకథలు -01.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నిద్రాహారంబులు మాని తమరితవర కెన్నఁడును విప్పిజూడని పురాతనపుజ్యోతిషగ్రంథంబు లన్నియు నొక్కయక్షరం బేనియు విడువకుండఁ పరిశీలింప దొడంగిరి.

ఇట్లారుమాసములు రాత్రింబగళ్ళు తదేకదృష్టిగాఁ బరిశీలించుచుండ నొక్కనాఁ డొక్కగ్రంథంబున రాజుగారి పూర్వపుణ్యముననో సిద్ధాంతుల యదృష్టంబుననో సంతానజననసూచకమైన విషయమందుఁ జూడనయ్యె. తత్సంవత్సరమాఘబహుళచతుర్దశీభానువారమునాఁటిరాత్రి తులాలగ్నమున రెండుగడియలు భుక్తియైన తరువాత నా గ్రామమున కుత్తరదిశను క్రోశద్వయపరిమాణముగల దూరములో నల్పప్రమాణ మెత్తుగల యంతరిక్షమున నక్షత్ర మొండుపడునని సిద్ధాంతమూలముగాఁ దేలినది. దానిని బుద్ధిమంతులైనసిద్ధాంతులు పుత్రోత్పత్తికిఁ గారణమగునట్లు మార్చిరి. చిరకాలము స్వర్గంబున బుణ్యసుఖం బనుభవించిన జనులు పుణ్యంబు క్షీణమైన వెనుక మర్త్యలోకంబున నక్షత్రరూపంబుగాఁ బడి పుడమి నధికులై జనింతురను శాస్త్రప్రసిద్ధి బట్టి యానక్షత్ర మొకకలశోదకంబునం బట్టి యజ్జలంబులం గ్రోలిరేని పుత్రోత్పత్తి యగునని నిశ్చయించిరి.

గణితాగతమైన యా విషయము బలుమారు శోధించి చూచి స్థిరపరచిన వెనుక వా రత్యంతసంతోషంబుతో రాజునగరి కరిగి మంత్రి కావృత్తాంత మెఱింగించిన నయ్యమాత్యశేఖరుఁడును వారి బుద్ధికుసలతకు మెచ్చుకొని తద్విధానమునఁ దప్పక సంతానము గలుగునని నిశ్చయించి యంతయెత్తున నొకమంచె గట్టించి దాని నెక్కుటకు వీలగురీతిని సోపానంబు లేర్పరచి సిద్ధాంతులు చెప్పిన మహాశివరాత్రినాఁటిరేయి యందఱు నక్కడి కఱిగి యొక్కవృద్ధబ్రాహ్మణు నుపవాసంబుతో దాని నెక్కించి పవిత్రోదకంబులచే నిండింపఁబడిన బంగారుకలశ మొకటి యతనిచేతి కిచ్చి రాజును మంత్రియు సామంతులు బౌరులు మరియు ననేకగ్రామములనుండి యవ్వింత జూడవచ్చిన ప్రజలును నారాత్రి నక్షత్రపతన దర్శనలాలసులై కనురెప్ప వేయక చూచుచుండిరి.

ఇట్లుండునంత సిద్ధాంతులు చెప్పిన మితి యొక్కింతేనియు నతిక్రమింపకయే యమ్ముహూర్తంబునఁ దళక్కురనుకాంతితో దృష్టులకు మిఱిమిట్లు గొలుపుచు నక్షత్ర మొండు చంద్రోదయమైన తెరంగున దెసలనెల్ల తేజఃపుంజంబుల వెదజిమ్ముచు విప్రహస్తకలశోదకంబునం ప్రజ్వలించుటయు నవ్వింత కత్యద్భుతస్వాంతులై లోకు లెల్ల హల్లకల్లోలముగా రొదజేయుచు గొందఱు సిద్ధాంతులను మరిగొందరు తద్గ్రంథంబును నభినుతించిరి. అవ్వరనాథుండు మంత్రి యనుమతి నా క్షితిసురుల కనేకాగ్రహారము లిచ్చుటయేగాక వారి తమయాశ్రితపండితమండలములలో ముఖ్యులుగా నెన్నుకొనుచుండెను.