పుట:కాశీమజిలీకథలు -01.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూరసేన మహారాజు కథ

25

మొదలైన సత్క్రియల వలన సంతానంబు వడయలేదా? అట్టి విధిం దెలుప మన పురోహితుండు సమర్ధుండని యతని మొగముపైఁ జూడ్కి నిలిపిన నా బ్రాహ్మణుఁడు లేచి యల్లన నమ్మహారాజుతో నిట్లనియె.

రాజా! సంతానము జనించుటకై పెక్కువిధుల గ్రంథంబులఁ జెప్పఁబడియున్నవి. హోమంబులు, దానంబులు, తీర్థసేవలు లోనగు సత్క్రియలవలన బుత్రులు జనింతురు. వానిలో సులభమగు మార్గంబు చింతించి, సంతానంబు గలుగుటకు పూఁటకాఁ పయ్యెదను.

బ్రాహ్మణప్రసాదంబున గాదే! తొల్లి వృద్ధుఁడైన నరసింహదేవమహారాజుగారు కృష్ణదేవరాయలం గని రనిన నృద్ధరాకాంతుఁ డావృత్తాంత మెఱింగింపుఁ డనుటయు బ్రాహ్మణుం డిట్లని చెప్పఁదొడంగె.

కృష్ణదేవరాయల జననకథ

ప్రసిద్ధుండైన నరసింహదేవమహారాజుగా రాంధ్రదేశంబున నధికధర్మిష్ఠుండై పాలించుచుఁ గవీంద్రులవలన ననేకకృతులు వడసి దిగంతవిశ్రాంతయశోమహితుండై యొప్పుచుండెను. ఇట్లుండియు సంతానంబు గొరంతయైనఁ జింతించుచున్న యావృద్ధభూవతి మతికి ధృతి గరపి యతని యమాత్యుం డారాజ్యంబున నూరక యనేకాగ్రహారంబుల ననుభవించుచు సంవత్సరంబున కొకసారియైన దర్శనం బియ్యని సిద్ధాంతులఁ బెక్కండ్ర పట్టాలతోడ రప్పించి సాదరపూర్వకముగా నిట్లనియె.

దైవజ్ఞులారా! మీదైవజ్ఞత్వంబు సార్దకమునొంద నేఁడు మీవలన మనరాజుగారి కొకప్రయోజనంబు దీర్పవలసివచ్చినది. దైవజ్ఞులన దైవమును గుర్తెఱిఁగినవారుగదా! గతాగతకాలముల జరుగు విషయములు మీకు గరతలామలకములై యుండును. మీ గ్రంథములకుఁ గోచరములుకాని సంగతు లుండవు. కావునఁ బురాతనగ్రంథములఁ బరిశీలించి రాజుగారి జాతకఫలమున కనుగుణ్యముగాఁ గాలరీతి గనిపెట్టి సంతానంబు గలుగు మార్గంబొండు వక్కాణింపుఁడు. చెప్పలే మంటిరేని తక్షణమే మీ యగ్రహారములకుఁ గల పట్టాలతోఁ గూడ నాస్తులను విడిచి యన్యదేశముల కఱుగవలసివచ్చును. మీ గ్రంథంబుల నట్టి సాంప్రదాయతమైన యర్థము దొరకక మాన. దిదియ ముమ్మాటికి నాజ్ఞయని బుద్ధిమంతుఁడైన యామంత్రి సెప్పినమాట లాలకించి యా సిద్ధాంతులు చింతాకులస్వాంతులై కొండొకవడికి నుదుట గదుర నప్పని కారుమాసములు మితి గోరిరి. మంత్రియు నట్టి మితి నిచ్చి వారి నిజనివాసంబుల కనిపెను. పిమ్మట నాజ్యోతిష్కు లిండ్ల కఱిగిన వెనుక నందరు నేకముఖముగా