పుట:కాశీమజిలీకథలు -01.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

సారముగా రాజ్యం బేలుచుండెను. వా రేగురు రాజ్యదేహంబునకుఁ బ్రాణంబులై యేకొరంతయులేక నడుపుచుండిరి. ఇ ట్లుండునంత నద్ధారాకాంతుఁ డొకవసంతకాలమున సాయంసమయమున నంతఃపురసౌధధోపరిభాగంబున నిష్కుటవిటపికుసుమవాసనలు నాసాపుటపర్వంబు గావింప నలుదెసలఁ గట్టిన వట్టివేళ్ళచాపలఁ జలించు జలశీకరంబుల నెగరజిమ్ము కమ్మని మలయమారుతమ్ములు మేనికి హాయిగా సోక నేకాంతపుకొలువు దీర్చి యక్కొలువుకూటంబునకు నల్వురమంత్రుల రావించి యంతకుమున్ను తనకుఁ గలిగిన విచారంబు వాపుకొనురీతిఁ బ్రసంగింపుచుండ నవ్విధం బెఱింగి వినయనిధి వినయంబున నిట్లనియె.

దేవా! దేవరవారి ముఖవిలాసం బరయ నేఁ డెద్దియో విచారగ్రస్తమానసులై యున్నట్లు తోచుచున్నది. తద్దయుం బ్రొద్దు చింతింపనట్టి కారణం బెద్దియున కానరాదు. ఎద్దియేనిం గలిగెనేని సమదుఃఖసుఖులమైన మాకుఁ జెప్పవలదె? చెప్పితిరేని ప్రాణంబులచే నగుకార్యంబైనను సమర్థింపగల. మవ్విధం బరయ మానసంబు లాత్రపడుచున్నవని యడిగిన నతనిమాట లాలకించి యొక్కింతసే పూరకుండి యుస్సురని దీర్ఘశ్వాసపూర్వకంబుగా నారాజు వారి కిట్లనియె.

మిత్రులారా! నాకు గొరంత యేమియును లేదు. నేఁడు మనయాస్థానమునకు వచ్చిన వార్తాపత్రికం జూడ నామనంబున నొక్కవిచార మంకురించినది. మనరాజ్యంబునఁ గోటీశ్వరుఁ డొకఁ డకాలమృత్యువుచేఁ గబళింపఁబడెనట! అతని కేవిధమైన సంతానమును సమీపజ్ఞాతులును లేకపోవుటయేగాక మరణశాసన మేమియును వ్రాయకుండుటంజేసి వాని యాస్తియంతయు మన యధీనమైనదని తద్గ్రామాధికారులు పంపిన పత్రిక యిందాక మీరు చూచినదే కదా!

సంతానంబు గొరంతయైన వానిగతి యెట్టిదో గంటిరే! మనకు సైత మిట్టిచందం బగునేమో యనుచింత యావిర్భవించినది . మనకు పూర్వప్రాయంబు కడచినది. దేహంబుతోడనే గదా మృత్యు వావిర్భవించుచున్నది. బ్రతుకునిక్క మెవ్వ రెఱుంగుదురు. మనలో నొక్కనికిని నొక్కపుత్రుఁడును లేకపోయెనే! మన యనంతరం బింతరాజ్యం బెవ్వని యధీన మగునో యని చింతించుచుంటి. ఇంతియకాని వేరొండు కాదు. దీనికి మీయుత్తరం బేమని యడిగిన బుద్ధిమంతుడగు నమ్మంత్రి యా రాజుతో వినయపూర్వకముగా నిట్లనియె.

దేవా! దీనికిఁ జింతింపకుఁడు. పుత్రోత్పత్తివిషయమై యనేకసాధనంబులు గలిగియున్నవి. తొల్లి దశరథాదిధరణిపతులు పెక్కండ్రు వృద్ధులయ్యు పుత్రకామేష్టి