పుట:కాశీమజిలీకథలు -01.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూరసేన మహారాజు కథ

23

నీ కాపేరు తగియున్నది. ని న్నిప్పటినుండి శౌనకుండని పిలుచుచుందు. నీవు చూచినది యొకకీలురథము. దానివృత్తాంత మెంతయు విచిత్రమైనది. కథారూపముగాఁ జెప్పినంగాని తెలియదు. సావధానముగా నాలకింపు మనుటయు వాఁడు చాల వేడుకపడి అయ్యా! మీ రక్కథ నాకుఁ జెప్పునప్పుడు గూఢార్థములుగల గీర్వాణపదముల గూర్చినచో గ్రహించుట కష్టముగా నుండును. తేటమాటలతో నెఱింగింపుఁడని వేడుకొనిన మెచ్చుచు నయ్యతిపతి వాని కిట్లని చెప్పదొడంగెను.

మొదటి మజిలీ

శూరసేన మహారాజు కథ

కాశ్మీరదేశంబున మధుర యను పట్టణంబున శూరసేనుండను రాజు గలం. డతండు ధార్మికుండును నీతిమంతుడును వినయశీలుండును బుద్ధికుశలండు నగుటచేఁ దన రాజ్యమందలి జనులెల్ల బిడ్డలవలెఁ జూచుకొనుచు వారివారికిఁ దగినరీతిఁగొలఁది కప్పంబులం గట్టుచు బేదలైనవారి కుటుంబమునకుఁ దగినవృత్తు లేర్పరచుచు దేవబ్రాహ్మణభక్తి గలిగి నిర్జలప్రదేశంబుల వాపికూపతటాకాదుల ద్రవ్వించుచు రామరాజ్యంబువోలెఁ బాలించుచుండెను. అతనియెడఁ బ్రజలు నధికతాత్పర్యముతో మెలగుచుండిరి. మఱియు నతనికి వినయవిధి యను మంత్రి గలం. డతండును గంటికి రెప్పరీతి రాజునకు ముప్పురాకుండఁ గాపాడుచు నీతిశాస్త్రపారంగతుడై సంధివిగ్రహయానద్వైదీభావసమాశ్రయములయందును సామదానభేదదండములయందును మిత్రామిత్రులయందును యథాయుక్తముగా మెలంగుచు అరులవలన రాజ్యంబున కేకొఱంతయు లేకుండునట్లు ఇంద్రునిచెంత బృహస్పతియుంబోలె సకలరాజ్యభారవాహుండై యుండెను.

ఆ రాజేంద్రుని పురోహితుడు కళానిధియనువాఁ డఖిలశాస్త్రములఁ బరిపూర్ణముగాఁ జదివినవాఁ డగుట నతనిసహాయమువలన గతాగతకాలముల మంచిచెడ్డలఁ దెలిసికొనుచుఁ గాలవైపరీత్యాదిదోషంబులకుఁ దగినశాంతులఁ గావించుచు నాఱే డతనిమంత్రంబుసైత మాలోచన సభలో ముఖ్యమైనదానిఁగా నెన్నుచుండెను.

మఱియుం బ్రాజ్యవాణిజ్యపూజ్యపతియగు నొకవర్తకుండును సకలయంత్రగదనానిపుణధిషణుండగు నొకకళాదుండును నాప్తులై యుండ నాభనాథుం డామంత్రిపురోహితవర్తకకళాదులు నలువుర నెల్లప్పుడు నెడబాయక వారియాలోచనాను