పుట:కాశీమజిలీకథలు -01.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివశర్మ యను బ్రాహ్మణుని కథ

21

రాజ్య మేలి కాశిలో నివసించి యందు మేను వాసి పునరావృత్తిరహితమగు శివలోకసాయుజ్య మందె. వాల్గంటీ నీ వింటివిగదా! ఇతరక్షేత్రంబులకుం గాశికింగల వాసి యని యెఱింగించి యగస్త్యుఁడు లోపాముద్రతో శ్రీశైలాదిపుణ్యక్షేత్రంబుల సేవించుకొని నేఁటికిఁగూడ దక్షిణదిశను గాపురంబుండెను .

గోపా! కాశీమహిమంబు వింటివా? పంచక్రోశవైశాల్యంబుగల యాక్షేత్రం బుత్తరవాహినియగు గంగాతీర మందున్నది. అందు విశ్వనాథుండు ముఖ్యదేవత. బిందుమాధవస్వామి క్షేత్రపాలకుండు. భైరవుఁడు పురరక్షకుండు. అన్నపూర్ణ విశాలాక్షి యనుపేరులం బరగియున్న దేవతయే ముఖ్యశక్తి. డుండి మొదలగు వారావరణదేవతలు. మణికర్ణిక తీర్థముఖ్యము. మరియు ననేకకోటిలింగంబులును ననేకకోటిమహాశక్తులుం గలిగియున్నయవి. అప్పురమహిమంబు సంక్షేపంబునం జెప్పితి. షణ్ముఖుండైన నిక్కంబు వక్కాణింప నోపం. డది ముక్తిస్థానంబు. పెక్కేల సేవించినంగాని తద్విశేషంబు లెరుంగఁబడవు. ప్రొద్దు చాల యెక్కినది. తత్సహాయమునకై యేమి యుత్తర మిత్తువో చెప్పుమనిన నా గొల్లచిన్నవాఁ డాకథను విన్నంత గోపభావంబు విడిచి మిక్కిలి గ్రహణశక్తి గలిగి కాశీ ప్రయాణోత్సాహంబు దీపింప నయ్యతిచంద్రునకు వందనం బాచరించి యిట్లనియె. అయ్యవారూ! తమరు నా కిప్పుడు చెప్పిన కథావిశేషములు కాశీప్రయాణమున కుత్సాహంబు గలిగించుచున్నవి. కాని యొండు వినుండు. మొదటినుండియు నాకుఁ గథలయందు తాత్పర్యము ఎక్కువగా నున్నది. నేను మీతో వచ్చునపుడు నడుచు ద్రోవ నెద్దియేని నొకవింత గనంబడిన దానిగురించి నాచేయు ప్రశ్నంబునకుఁ గథామూలముగా నుత్తరం బిచ్చుటకు నొడంబడుదురేని యిప్పుడు మీమూటం బూని వచ్చువాఁడ నట్లియ్యని యాక్షణంబ యింటికి మగిడిబోవువాఁడ నిదియ మదీయవాంచితంబు. దీనిం జెల్లింప నొడంబడుఁడని వేడుకొనుటయు నయ్యతిపతి మిగుల సంతసించి గోపా! నీ కోరిక యిదియేకద. అట్టిప్రశ్నములకు మాటికి విచిత్రములగు కథల మూలముగా నుత్తరము జెప్పువాఁడ. సంశయింపకుము. లేలెమ్ము. పురమ్మున కరిగి నీయజమానుని కెఱింగించి రమ్ము. పొమ్మన నపుడు వా డందులకు వందనపూర్వకముగా నియ్యకొని యాక్షణంబ పురంబున కరిగి యక్కాపునకుం జెప్పి యొప్పించుకొని కావలసిన సామగ్రి కొంత గైకొని కావడి గట్టి యక్కావడి మూపునం బూని తోడరా నొకశుభముహూర్తంబున నామణిసిద్ధయతీంద్రుఁడు కాశీయాత్రకుఁ బ్రయాణము సాగించెను.

అయ్యతిచంద్రుఁడు నియమముగాఁ గాశీయాత్రఁ జేయఁదలఁచుకొనుటంజేసి దారి నడచునప్పుడు మౌనము వహించి ప్రణవాక్షరజపము జేసుకొనుచు నడుచు. గొల్లవా డెద్దియేని నడుగుచుండఁ జేయి వీచి మాట్లాడగూడదని సూచించుచుఁ గాశీనగర