పుట:కాశీమజిలీకథలు -01.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యిప్పుణ్యాత్ము లెవ్వరో కదా నన్ను మిగుల గౌరవపరచుచున్నవారుఁ వీరి కులగోత్రంబులఁ దెలియుట లెస్సయని వారి నుపలక్షించి యిట్లనియె.

అయ్యలారా! మీ రెవ్వరు? దీని నెవ్వరికై గొనితెచ్చితిరి మీవృత్తాంత మెట్టిదో యెఱింగింపుఁ డనిన వారును జిఱునగవు మొగమునకు నగయై మెరయ నో శివశర్మా! మేము విష్ణుకింకరులము. నీచేసిన సుకృతమునకై వీని నీనిమిత్తమే తీసికొనివచ్చితిమి ఇవ్విమానరత్న మదిష్టింపుము. విష్ణులోకంబున కేగుద మనుటయు నతం డొక్కింత పరిశీలించి తాను జదివిన గ్రంథంబుల నవలోకనంబు జేసికొని యోహో ఇది నాకు మరణావస్థయని తెలిసికొంటి. తీర్థసేవం గావించిన పుణ్యంబే కదా న న్నింతగౌరవపరచుచున్నది. పురాణంబుల జదివినరీతిని మరణాంతరమునఁ బుణ్యాత్ములఁ బుణ్యలోకంబునకుం గొనిపోవు విమానమా యిది? మేలు మేలు! నా పుణ్య మిట్టిదే యని సంతసించి వా రిచ్చిన భూషణాంబరములఁ దాల్చి యక్కింకరు లిరుగెలంకుల వింజామరలు వీవ నవ్విమానరత్నం బధిష్టించి యూర్ధ్వలోకాభిముఖుండై చనియెను. అట్లు కొంతదూరం బఱిగినంత మహిషవాహనారూఢుండై దివ్యపురుషుం డొకఁ డేతెంచి యతనికి నమస్కరించి చనుటయు శివశర్మ విష్ణుకింకరుల నీదివ్యపురుషం దెవ్వఁడని యడిగిన వా రితఁడే కదా భూతసంఘాతంబుల సమయించు యముం డనియు నిది యమలోకపుపొలిమే రనియుఁ జెప్పిరి దాని కతండు వెరగంది యయ్యా! పురాణంబుల యముని రూపము భయంకరముగా వర్ణింపఁబడియున్నదే! ఇంత సౌమ్యుఁడుగా నుండుటకుఁ గతంబేమి యనిన వారిట్లనిరి.

పుణ్యాత్మా! పాపాత్ముల కట్టియేపున గాన్పించును గాని మీవంటి పుణ్యాత్ములకు మాత్ర మిట్టిరూపముతో వచ్చి చూపట్టువాఁడని యెఱింగించుచుండ నవ్విమానరత్న మాలోక మతిక్రమించి మఱియుం బెక్కు భువనంబుల దాటి బ్రహ్మలోకంబునకుం జనినది. ఆలోకం బాలోకోత్సేకంబగుట శివశర్మ కాలోకింప నభూతకౌతూహలం బొదవించె. అంత నక్కింకరు లతని బ్రహ్మసభకుం గొనిపోయి తదీయవృత్తాంతం బెఱింగించిన నవ్విరించియు వింతయేనా యని పెదవి విరచె. పిమ్మట నావిమానంబును విష్ణులోకంబునకుం గదలుటయు శివశర్మ చతురాసనుండు తన్నుగుఱించి యీసడించిన సంగతి విష్ణుకింకరుల నడిగిన వారిట్లనిరి.

అయ్యా ! నీవత్యంత పుణ్యాత్ముండివని మేము నిన్ను వినుతించిన నవ్విరించియుఁ గాశిలో మేను విడువని కొరంతను గురించి యీసడించె. వారణాసిం గాత్రంబు వాయని నరు లెట్టిపుణ్యాత్ములైనను పునరావృత్తిరహితమగు ముక్తిం బడయనేరరని యెఱింగించుచుండ నవ్విమానంబు విష్ణులోకంబునకుం గొనిపోయెను. పిమ్మట శివశర్మ విష్ణులోకంబునఁ బెద్దకాలంబు సుఖించి మరల ధరణీపతియై జనియించి కొంతకాలంబు