పుట:కాశీమజిలీకథలు -01.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మణీ! నీ వేల మాటాడఁబోయి యూరకుంటి వెద్దియేని సందియం బున్న నడుగు మని సాదరంబుగా బలికిన నామెయు నతివినయముతో ప్రాణవల్లభునకు నమస్కరించి యిట్లనియె. నాథా! శిఖరదర్శనమాత్రమున ముక్తిప్రదంబయి యీక్షేత్రం బింత ప్రాతంబున నుండ జచ్చినంగాని మోక్షం బీయజాలని కాశి కఱిగి గాశిజెంద నేటికి? మీరును కాశీవియోగసంతాపము పాతాళగంగాప్రవాహశీకరంబుల నార్చుకొనుచు సుఖంబున నిం దుండరాదే? యని యడిగిన పడఁతి సంప్రశ్నమున కగస్త్యుఁడు మెచ్చుకొని యామె సందియంబు వాయ నిట్లని చెప్పందొడంగె. అంగనామణీ! శ్రీశైలాది పుణ్యక్షేత్రంబులు కాశివలె బునరావృత్తి ముక్తిసౌఖ్యం బొనగూర్పజాల. వీయర్థంబు తేటబడ నొకయితిహాసంబు సెప్పెదను నాకర్ణింపుము.

శివశర్మ యను బ్రాహ్మణుని కథ

మధుర యను పట్టణంబున శివశర్మ యసు బ్రాహ్మణుఁడు కలండు. అతండు సమస్తవిద్యలయందుఁ బ్రవీణుండై పండితరాజను బిరుదు వహించి పెక్కురొక్కంబు సంపాదించి గృహస్థధర్మముల యోగ్యవర్తనములచే నాచరించుచుఁ బుత్రులఁ బెక్కండ్రం గని తత్సంతోషంబు గొన్నిదినము లనుభవించిన వెనుక నొక్కనాఁ డంతరంగమున యౌవనంబుపోకను ముదిమిరాకను దలంచి యిట్లు చింతించెను. కటకటా! నా దగు పూర్వప్రాయమంతయు నైహికసుఖంబులకై వృథా వ్యయపుచ్చితి. నాముష్మికం బింతయైనను సంపాదించుకొననైతి. సిరు లశాశ్వతములు. మేను చంచలము, బంధులు మాయాసంబంధు లని యెఱింగియు అనాదియగు నవిద్యచే నవి యన్నియు దిరములై యుండునట్లుగానే వ్యాపారములు జరిపింపబడుచున్నవి. నేనును అట్టి జ్ఞానంబు గలుగఁజేయు గ్రంథములు పెక్కు జదివియు ననుభవంబు లేమిం జేసి యింతవట్టును వట్టి బూటపుదానికై దొరలుచుంటిని. నేఁటి కెద్దియో పూర్వపుణ్యఫలంబునఁ దెలిసికొంటి. ఇప్పుడు తీర్థయాత్రారూపంబునఁ బుణ్యం బుపార్జించెదనని నిశ్చయించి యప్పుడు కొడుకులకు సొత్తంతయుం బంచియిచ్చి యొక్కశుభముహూర్తంబున నిల్లు వెడలి కతిపయప్రయాణంబుల గాశీపురంబున కఱిగెను.

కాశీమహిమ నంతయు నంతకుమున్న చదివినవాఁ డగుట నొరుల సహాయము లేకయే యందలి తీర్థవిశేషంబుల నరయుచుఁ తీర్థోపవాసపూర్వకముగా గంగానదిం గృతావగాహుండై యంగం బుప్పొంగ విశ్వనాథుని దర్శించి యానందబాష్పములతోడ నద్దీపుని కభిషేకంబు గావించి సంపూర్ణమనోరథంబుతో నన్నపూర్ణ నారాధించి