పుట:కాశీమజిలీకథలు -01.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ మహిమ దెలుపుకథ

17

కన్నీరు గార గోలుగోలుమని యేడ్చుచుం బలికి యందు వెడలి కతిపయప్రయాణంబుల వింధ్యాద్ రికఱిగెను. అని చెప్పిన గోపాలుం డయ్యా! ఆయూర బాయుట కాయన యంత యడల నేటికి? కార్యంబైన వెనుక మరల నరుగరాదే! యనిన నయ్యతియు వినుము. నీ ప్రశ్నంబున కుత్తరంబు ముందరికథయే చెప్పఁగలదు.

అట్లు లోపాముద్రాసహాయుండై యగస్త్యుండు తనచెంత కఱుదెంచుటయు వింధ్యుండు గర్వంబు విడచి గురుభక్తితో మిన్నంటియున్న తనశిఖరంబులు పుడమి యంట మునియడుగులం బడియె. అప్పుడు మార్గావరోధంబు వాసిన భాస్కరాదిగ్రహంబులు యథామార్గంబుల సంచరించుటచే లోకోపద్రవం బడంగె. పిమ్మట నమ్మునిపతియు నతని శిరంబున గరంబిడి వత్సా! మేము దక్షిణయాత్ర కరుగుచున్నవారము. వచ్చునందాక నీ వీతీరున నుండుము. అట్లుండకున్న మదీయప్రభావం బెఱుంగఁజేసెదనని యతని నొడంబరచి దక్షిణాభిముఖుండై యగస్త్యుండు చనియె. అదియే సుమీ! మరల నుత్తరంబున కగస్త్యుండు రాకునికి గారణంబు. విను మ ట్లయ్యగస్త్యు గడువింధ్యాద్రి నేలం బడనేసి క్రమంబున భద్రాచల పట్టినాచల పుష్పాచల ధవళాచలాది పుణ్యక్షేత్రంబులు సేవించుకొనుచు శ్రీశైలంబున కరిగెను.

ఆ శ్రీశైలశిఖర మీక్షించినంత మేనుం బులకింపఁ దదీయమహిమ దిలకించి యగస్త్యుండు లోపాముద్రతో నిట్లనియె.

పూబోఁడి! చూడు మిది శ్రీశైల మిందు మల్లిఖార్జునదేవుం డేకాంతముగా భ్రమరాంబాసహాయుండై విహరించుచున్నవాఁడు. ఇన్నగాంతరమునుండి కృష్ణవేణి పాతాళగంగ యనుపేరఁ బ్రవహించుచున్నయది ముప్పదియోజనంబుల వైశాల్యంబును నాలుగుద్వారంబులును, సంజీవినీప్రభృతిదివ్యౌషధులును, సంచారవృక్షంబులును, కదళీచందనవిల్వాద్యనేకవనంబులును వరాహనారసింహాదిబిలంబులును, రత్నాకరంబులగు నిధులును, ముక్తిప్రదంబులగు పెక్కుతీర్థంబులును, ననేకకోటిమహాలింగములును గలిగియున్నవి.

ఇం దుండుపాషాణంబు లెల్ల శివలింగంబు లనియుఁ జెంచులు మహర్షు లనియుం చెప్పుదురు. పెక్కేల విన్నీలకంధరు నాలయంపుశిఖరము జూచినంత మోక్షంబు జేకూరు నని తదీయప్రభావంబు పలుదెరంగుల నభివర్ణించుచుండ నాలకించి లోపాముద్ర మౌనముద్ర దిగనాడి మనోహరువదనంబులపై చూడ్కి నిలిపి యెద్దియో యడుగంబోయి యూరకున్న నాసన్న యెఱింగి యమ్మునివరుం డంగనా