పుట:కాశీమజిలీకథలు -01.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

భావత్వ మగ్గించి యాహా! వింధ్యాద్రి మూలంబునగదా మన కేతన్నగరాలోకనకౌతుకంబు సంప్రాప్తించె ధన్యులమైతి మని తలంచి గంగానదిం దీర్థంబులాడి విశ్వనాథు నభిషేకముఖార్చనావిశేషంబుల నారాధించి యన్నపూర్ణను భజించి ఢుండి భైరవాదుల పాదంబుల కెరిగి మరియుంగల శివలింగమూర్తుల నర్చించి యందందు నగస్త్యుని జాడం గనిపెట్టుచు నెట్టకే నొకరీతి నాతపస్వియున్న యిక్క యెఱింగి యొక్కగుహాముఖంబుగా నయ్యాశ్రమంబు సేరిరి.

అక్కుంభసంభవుండును జంభారిప్రముఖబహిర్ముఖుల రాక యెఱింగి పొంగినడెందంబుతో వారి కర్ఘ్యపాద్యాద్యర్చనావిధులం దీర్చి దర్భాసనంబుల నాసీనులం జేసి పదంపడి స్వాగతపూర్వకముగా నాగమకారణం బడుగుటయు నాదేవతలు బృహసృతిముఖంబుగా లోకంబులకు వింధ్యాదిమూలంబునం యుపద్రవప్రకారం బెరిగించి యాబాధ బాపుమని యత్తపోదనసత్తమునిం బ్రార్థించిన నంగీకరించి యతండును వారి నిజనివాసంబుల కనిపె. సుర లరిగిన వెనుక నమ్మునివరుండు కాశీనివాససౌక్యంబునకుం గలిగిన యంతరాయమును దలంచి కలఁగిన మతితో లోపాముద్ర నీక్షించి యిట్లనియె.

కాంతామణీ! నిరంతర మిప్పురంబున ననంతసుఖం బనుభవించుచు నేకాంతముగా వసించియున్న న న్నెట్టెఱింగిరో? నిలింపులు తత్సుఖంబున కంతరాయంబు గలుగజేసిరిగదా! నా గొప్పతనంబే నా కింతముప్పు దెచ్చినది. కటకటా! నాకు సురతటినీజలావగాహనయోగంబు లేదు గాబోలు. పర్వతసంఘంబులనెల్ల గడగడ వడకించు బల్లిదుఁ డొకగిరికి వెరచి నేఁడు నామఱుఁగు గొలవవలెనా! ఇదియు మదీయకర్మఫలంబే గదా! అప్పు డప్పని కెద్దియేని ప్రతిరోధము సెప్పక చెప్పున నొప్పుకొంటి. నీవైనను సెప్పవైతివిగదా! యతివా! యని యనేకప్రకారంబులఁ జింతించుచుఁ బ్రయాణోన్ముఖుండై యప్పురంబు ముమ్మారు వలఁగొని కొంతవడి నడచి యప్పురాభిముఖుండై యిట్లనియె. హా! తల్లీ గంగాభవానీ! నీ చల్లదనంబు విడిచి పరమనిర్భాగ్యుండనై యన్యదేశం బరుగుచుంటి. కరుణించి యనుజ్ఞ యిమ్ము . అన్నపూర్ణ! నీచేతి భిక్షాశనంబు విడిచి వేరొకయెడ కరుగుజనునియెడ గృప విడువకుము. హా! విశ్వనాథ! నిన్ను విడిచిపోవఁ గాళ్ళాడకున్నది. బిందుమాధవా! నాయం దక్కటికముంచుము పోయివచ్చెదను. ఓడుంఠీ! శుండాదండసీత్కారమారుతమ్ముల నెన్నడు తాప మార్చికొందునో? భైరవా! భక్తచకోరబైరవాప్తుండవగు నీపొందు వాసి యేగుటకన్న వ్యసన మున్నదే? మణికర్ణికా! నీ ప్రభాతం బెఱింగియుఁ బెరచోటి కరుగు దురితాత్ముండు గలడే! అని పెద్ద యెలుంగునఁ దద్దయుంబ్రొద్దు గాశిఁ దలంచి