పుట:కాశీమజిలీకథలు -01.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ మహిమ దెలుపుకథ

15

గిరీంద్రా! పాపము నీవు లోకంబుపాటి మాటల నాడుచుంటివి. మొన్న నే నమ్మేరుధారుణీధరంబుకడ కరిగితి. అదియు నీ వెట్టట్టు లవంధ్యగర్వంబునం బల్కుచు నిన్ను చిన్నమెట్టలతోటి సాటిగా బేర్కొని తన కెందును సాటియగు నగంబులేదని ముమ్మా రొత్తిపలికినది. మీ యిద్దరతారతమ్యంబులు నొరులకు నరయ శక్యమే! నీకు మేలయ్యెడుంగాక పోయివచ్చెదనని యక్కలహభోజనుం డెందేనిం జనియె.

పిమ్మట వింధ్య యమ్మునితిలకుని పలుకులఁ దలంచి కలకజెందిన డెందంబుతో నౌరా? మేరుగిరి కింత పొగరేల? దానిమదం బుడగింతు నని యాక్షణంబ యవక్రవిక్రమంబునఁ దివిక్రముండువోలె బ్రహ్మాండకరండంబునిండ దనమేను బెంచి నిక్కిచూచుటయు సూర్యాదిగ్రహగమనంబుల కంతరాయంబైన కతంబునం గొన్నిలోకంబు లంధకారంబును గొన్నిదేశంబు లెండయుఁ గొన్నివిషపంబు లివకయుఁ గొన్నిదేశంబుల హిమంబును బీడింపఁదొడంగినది. అయ్యకాండప్రళయోత్పాతం బెఱింగి యింద్రాదిబృందారకసందోహము శతానందుని దరి కరిగి యవ్వెరపుతెరం గెఱింగించిన నవ్విరించియు నయ్యుపద్రవంబు లోపాముద్రామనోహరునివలనంగాని చక్కఁబడదు. అమ్మహానుభావుం డిప్పుడు కాశీపురంబునం గాపురంబు సేయుచున్నవాఁ డతనిం బ్రార్థింపఁబొం డని యాన తిచ్చిన గీర్వాణులు వాణీధవునానతి కాశీపురంబున కరిగిరి.

గోపాలా ! యింతవట్టు కథ స్పష్టంగాఁ దెలిసినదియా! యనిన వాఁ డయ్యా! మీదయచే నంతయుం దెలియుచున్నదిగాని యిం దొక్కసందియం బుదయించె వినుఁడు. వింధ్యంబన మనము చూచు మెట్టలకన్న సున్నితము గలిగియుండవచ్చును గాని మనుష్యునివలె మాట్లాడుటయు నెదుగుటయు నెట్ లుగలిగియున్నదో నాకు విడిపోవకున్నది. దాని నిక్కంబు తెరం గెఱింగింపుఁ డనిన నతండు వానిశంకకు సంతసం బంకురింప వెండియు నిట్లనియె.

భూతలంబున మహానుభావసంపన్నంబులగు కొన్నిగిరులకును మనుష్యులవలె జంగమరూపంబులు గలిగియున్నవి. అవియు భార్యాపుత్రాదులఁ గూడి కాపురంబు సేయుచున్నటుల గ్రంథంబుం వ్రాయబడియున్నది.

హిమాచలపుత్రియగు పార్వతీమహాదేవిని శివుండు పెండ్లి యాడిన కథను నీవు వినలేదు గాబోలు. వింధ్యాద్రియు నట్టి గిరికోటిలోని దగుట నట్లాచరించె. తర్వాత వృత్తాంత మాలకింపుము. ఇంద్రాదు లట్లు కాశీపురంబున కరిగి యప్పుడు మహాను