పుట:కాశీమజిలీకథలు -01.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గొ — ఏమిటో పాండవకథంటే పందికథంటే మరి కామమ్మకథంటే యిలాటివే కాని మరి వినలేదు.

మ — నేను చెప్పినది నీవు జ్ఞాపకము వుంచుకోగలవా?

గొ – నాకు కథలంటే మహాయిష్టము. తెలిసేలాగున చెప్పితే జ్ఞాపకముంచుకోగలను గాని గొదవలును పెద్దమాటలుగాను చెప్పకుము.

మ - అలాగునేయని యతని శిరముమీఁద దనహస్త మిడి వానికి గ్రహణశక్తి పూర్ణముగాఁ గలిగించి యక్కథ నిట్లని చెప్పందొడంగెను.

కాశీమహిమ దెలుపు కథ

గోపా! వినుము. తొల్లి త్రిలోకసంచారియగు నారదుండు తీర్థయాత్రకు వెడలి యనేక పుణ్యస్థలంబుల కఱిగి యఱిగి యందలితరంగిణుల నవగాహంబు సేయుచు నొక్కనాఁడు వింధ్యాచలోపాంతకాంతారంబుదరియం జొచ్చె. అదియు నుద్యానవనంబువోలెఁ గమనీయభూరుహలతావృతంబై యొప్పుటం జేసి యమ్ముని స్వాంతంబునకు విశ్రాంతి గలుగఁజేసినది.

పదంపడి యమ్మునియు నర్మదానదిం గృతావగాహుండై మధురఫలరసాస్వాదనమత్తశుకపికస్వానగానంబునకుఁ దానంబులగు మరందబిందుపానాలోలరోలంబనాదంబులు చెవుల కింపు జనింపజేయ నడచు నజ్జడదారి రాక యెరింగి వింధ్యాచలేంద్రుడు జంగమరూపంబున నెదురేగి యర్ఘ్యపాద్యాదివిధుల నమ్మహానుభావు నర్చించి విశ్రయించియున్న కొండొకవడి కిట్లనియె. స్వామీ మునీంద్రా! నా కొక్కసందియంబు గలదు. వక్కాణింపుఁడు. లోకంబున లెక్కకురాని మెట్ట లెన్నియేం గలవు. వానిం బాటింప నేటికిఁ మేటియని పేర్కొనువానిలో హాటకాచలంబును నేనుంగదా మేటులమై యుంటిమి. పక్షపాతంబు మాని మా యిద్దరకుంగల తారతమ్యంబు వక్కాణింప మీరలు సమర్థు లని యడిగిన నజ్జడదారి యెక్కింతసే పూరకుండి శిరఃకంపంబుతో నుస్సు రని యిట్లనియె.