పుట:కాశీమజిలీకథలు -01.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ మహిమ దెలుపుకథ

13

మ - పెళ్ళి.

గొ - (నవ్వి) యింకా కాలేదు.

మ - కోటప్పా! ని న్నొకయుపకారము కోరెదను చేయుదువా?

గొ - నేను సేసేయుపకార మేమిటండో?

మ — నేను కాశికిఁ బోవుచున్నాను. ఒంటరిగాఁ బోఁగూడదు. తోడువచ్చిన నన్నవస్త్రములిచ్చి యే మడిగితే అది యిచ్చి చిత్రమైనకథలుకూడా చెప్పెదను.

గొ - నీవు కాశీవి యెవరి పశువులు?

మ - పశువులు కాయడముకాదు కాశీ యన నొకపట్టణము.

గొ - కాశీ అంటె యెక్కడ నున్నది ?

మ - అది మహాస్మశానము. గంగయొడ్డున నున్నది.

గొ – బాబో! నన్ను గంగయొడ్డుననున్న స్మశానములోనికి రమ్మంటివా?

మ - దాని పేరేకాని స్మశానముకాదు. పెద్దపట్టణము.

గొ – అక్కడకు వెళ్ళడ మెందుకు ?

మ — అది మహాపుణ్యభూమి! అక్కడకుబోయి గంగలో స్నానమాచరించి విశ్వనాథుని దర్శించి యొకరాత్రి వసించినను మరుసటి జన్మమునకు మహారాజై పుట్టుదురు.

గొ - ఎవరు వెళ్ళినానా ?

మ - మనుష్యులు పక్షులు పురుగులు మృగములు మొదలైనవికూడ గంగలో మునిగినంత ముక్తినొందును.

గొ – అక్కడనుంచేనా కాశీకావిడి తీసుకొనివచ్చి ముష్టెత్తుకొనేవాళ్ళు డబ్బిస్తే కాశీపట్టణముఁ జూపించెదరు?

మ - ఔను వారలు యాత్ర చేసినవారే.

గొ - అలాగైతే దాని పుట్టుపూర్వోత్తరమంతా చెప్పుము. విన్నపిమ్మట నాకు బాగున్నదని తోచిన వచ్చెదనని చెప్పుతాను. లేకపోతే రానని చెప్పుతాను.

మ - (ఆ మాటను వినినంత సంతోషించి వానిదరికిఁ జేరి యక్కడనున్న మఱ్ఱిచెట్టునీడం గూర్చుండఁబెట్టి) దాని పూర్వోత్తరమును సంక్షేపముగాఁ జెప్పెదను గాని నీ విదివర కేమైనా కథలు వినియున్నావా?