పుట:కాశీమజిలీకథలు -01.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యీకథ యొకప్పుడు మాతాతగారు నాకుఁ జెప్పిరి. కాశికిఁ బోయినవాఁడు తిరుగ నింటికిరాఁడని యాబాలగోపాలవిదితమే. మీ రింత చెప్పవలయునా? నామనవి మన్నించి మీరును నప్పయనపువేడుక మరలించుకొనుఁడు. మిత్రుఁడవగుట నింత జెప్పుచుంటివి. ప్రణవాక్షరజపము జేసికొనుచు స్వదేశంబున వసింపుఁడు అని యెంతయో యుపన్యాసముగాఁ జెప్పెను.

మణిసిద్ధుం డద్దిరా! బుద్ధిమంతుడ వౌదు వెంతగాథ జెప్పితివి. చాలుఁజాలునని పలుకుచు వానిని విడిచి వేరొక సఖునిం జేరి యాత్మీయాభిలాష నెఱింగించుటయు నతండును గాశీప్రయాణం బతిప్రయాసజనకంబని నుడివి యనంగీకారము సూచించెను.

ఇ ట్లడిగినవారెల్లఁ గాశీపురంబును నిందించుచుఁ బోవలదని తన్ను మందలింపుచుండ మిక్కిలి పరితపించుచు జాత్యంతరులఁ బెక్కండ్ర నడిగియు విగతమనోరథుండై యొక్కనాఁ డిట్లు తలంచె.

అయ్యో! దైవమా! నే నేమి పాపమాచరించితిని. కాశీనివాసయోగము నాకు లేదు గాఁబోలు! విశ్వనాథసందర్శనంబును, గంగానదీస్నానంబును, నన్నపూర్ణచేతిభిక్షయుఁ, బూర్వపుణ్యఫలంబునం గాక యూరక లభింపవండ్రు. ఈశ్వరానుగ్రహం బెట్లున్నదోగదా యని యనేకప్రకారంబులఁ జింతించుచు గనబడినవారినెల్లఁ గాశికి వత్తురే యని యడుగుచు వెఱ్ఱివానివలెఁ దిరుగఁజొచ్చెను. ఇ ట్లనేకపురంబులు కాశీయాత్రాసహాయనికయి యయ్యతీశ్వరుండు గ్రుమ్మరుచుఁ గాశీపురాయత్తచిత్తుండయి విశ్వనాథుని ధ్యానించుచు నన్నపూర్ణం గొనియాడుచు గంగాభవానిం బొగడుచు నొక్కనాఁ డతం డొకగ్రామాంతరమునఁ జిట్టడవిదారి నడచుచుండ ముందట —

సీ. వాసనల్ వెదజల్లు వనసుమావళి శిఖా
               శ్రవణభూషలు గాఁగ సంతరించి
    పెనుగోచి దిగియఁగట్టినతోలు మొలత్రాట
               వరుసఁ గత్తియుఁ గొడవలియుఁ జొనిపి
    పసిమేత తమి నాల్గుదెసలకొయ్యలఁబారు
               వసులఁ గ్రమ్మరఁ బ్రోగుపరచికొనుచు
    పొగరెక్కినట్టియాఁబోఁతు నెక్కి విచిత్ర
              గతులఁ దోలుచుఁ దురఁగమునుబోలె