పుట:కాశీమజిలీకథలు -01.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

కాశీప్రయాణక్లేశంబు నాతో చెప్పెను. అక్కడ వినిన నిప్పయనం బెవ్వరునుఁ జేయ యత్నింపరు. తా నెవ్వరి ప్రోత్సాహముననో మత్పితామహుం డొకప్పుడు నెలవున సుఖముగా నిలువలేక రాకాశియగు కాశి కరుగ నుత్సహించి కొంతమంది సహకారులతో బయలుదేరెనఁట. బయలుదేరునప్పుడు పాథేయమునకై మోయునంత పిండియుఁ బెసరపప్పు నుప్పును గారంబునుం గలిగిన చింతపండును గొన్నిబట్టలును గొంతసొమ్మును మూటగట్టుకొని యమ్మూట శిరంబునం బూని, పూటకు రెండుయోజనంబులు నడువదొడంగిరి.

మా తాతగా రతినియమస్థు లగుట సత్రంబుల భుజింపఁడు. కుతపకాలంబునకుఁ జేరినయూర నన్నంబు వండుకొనుచుండును. అతినియమస్థు డగుటచే నెక్కుడుగా నాకలియైనప్పుడు రాత్రులఁ బిండి చేసికొని భుజించును.

అటు నడువ నడువ నాయాస మెక్కుడైనకొలదిఁ దినమునకు యోజనత్రయమే నడువసాగిరి. మరి పదిదినములకు పూటకు యోజనము మాత్రము నడువ నాత్రముగా నుండెనఁట. ఇట్లు నడుచుచుండ నొక్కనాఁటి మజిలీ దవ్వుగానుంట విని జామురాత్రి యుండగనే లేచి తోడివారలతోఁ గూడ నడవిమార్గంబునం బడి నడచు చుండెను. అన్నిశాంతంబున ననంతవేగవాతోద్ధూతంబులై జీమూతసంఘాతంబు లొక్కపెట్టున పుడమి యిట్టట్టుగదల గర్జిల్లుచు నాకసంబంతయు నావరించి తళుక్కురను మెరుపులు చూపులకు వెరపు గరపఁ దెరు వెరుంగని యిరులు గ్రమ్మఁ బెనుజడి గుమ్మరింప నొడలు తడిసి గడగడ వడంక నగ్గాలివాన నిలువ నెందుఁ దావు కానక యత్యంతదుఃఖాక్రాంతస్వాంతుడై మత్పితామహుండు మేనిపై నాసబూనక చిత్తం బుత్తలపడ నెత్తిపై నెత్తుకొన్న తడిసినమూటను మాటిమాటికి భుజమున మార్చుకొనుచు నతిక్లేశముతో నడచుచుండెను. అట్టితరి నెట్టిసుమతికైన విసుగు రాకమానునా?

తడిగుడ్డల బిండుకొని గాలివాన యొక్కింత యఁడగినదని సంతసించుచు నడువయత్నించుచుండ నొకదండనుండి ప్రచండకోప మేపార దండధరకింకరులఁ దిరస్కరించు తస్కరు లెదురై బెదరుగదుర నార్చుచు దండంబునఁ మోది యబ్పాటసారుల దోచికొని కట్టుగుడ్డలతోఁ బ్రాణంబుల మిగిలిచి సాగనంపిరి.

నడచునప్పు డతిభారమైన మూటలు లేకపోవుటచే నాఁటి పయన మెంతేనిఁ దేలికయైనది. తెల్లవారిన వెనుక మాతాతగారును సహవాసులును జేతఁ గాసైనను లేకపోవుటచే మేనులు గాసిజెందుటచేఁ గాశిపై గొంతవిసుగుఁ దోప నడచుచు మిక్కిలిదవ్వగు నాఁటి యవసధంబు పయనంబున కంతరంబున నంతరాయము వాటిల్లుటచే మాపునకుఁ జేరుట కడు ప్రయాసమైనది.