పుట:కాశీమజిలీకథలు -01.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిసిద్ధుని కథ

7

తోడు రమ్ము. పుత్రమిత్రకళత్రాదులయెడ మమత్వమోహంబు విడువుము. వారు పరలోకసౌఖ్యమునకు శత్రువులు. మేను శాశ్వతంబు గాదు. కాశీపురంబు దర్శనమాత్రమున సంసారతాపత్రయముల యాత్రం బుడిగించునని నుడివిన దడయక మరల నాపుడమివేల్పు మణిసిద్ధున కిట్లనియె.

అయ్యా! కాశీపురం బట్ ప్రభావసంపన్నంబే కాని మార్కం బమితక్లేశజనకం బని చెప్పుదురు. కాశికిఁ బోవుటకంటెఁ గాటికి బోవుటయే సుఖ మన విందును. ఇదియునుఁ గాక దివ్యజ్ఞానసంపన్నులగు మీవంటివారలకు తీర్థయాత్రవలన బ్రయోజనం బేమి? అజ్ఞానులకు మార్గక్లేశంబువలన జ్ఞానంబు కలుగునని తీర్థయాత్ర విధించిరి. మానసతీర్థం బాడనివారికి నాడువారికినిగూడఁ తీర్థయాత్రవలన లాభము లేదందురు. పామరులకు వైకల్పితంబగు యాత్రలకై తమవంటి యతు లతిప్రయత్న మొనరించుట నీతిగాదు. నామాటలం బాలించి యప్పని యుడుగుఁ డనిన నతనితో మారుపలుకక యయ్యతితిలకుండు నింకొక చెలికానిం జేరి —

గీ. విశ్వనాథుండు దేవతావృక్ష మమర
    గంగ దుర్వారపాపప్రభంగ యన్న
    పూర్ణగీర్వాణసురభి యపూర్వపుణ్య
    ఫలదములు తీర్థములు శుభాస్పదము కాశి.

అప్పురంబునకుఁ బోవుచుంటిఁ దోడురమ్మని జీరుటయు నతం డిట్లనియె.

స్వామీ! నామీఁదఁ గోప మూనకుఁడు. కాశీమార్గంబున రోగబాధయుఁ జోరబాధయు మెండఁట. పరలోకతుల్యమగు కాశి కరిగి యొక్కండేని యిక్కడకుఁ జేరినవాఁడు గలఁడే! యట్టి ప్రమాదాస్పదంబగు యాత్ర కిట్టిప్రాయంబున నున్ననే నెట్లు తోడు వత్తునని యుత్తరం బిచ్చిన తత్తరమందినడెందముతో నతండు వెండియుఁ గొండొకకొండికం జేరి యిట్లనియె.

వత్సా! తీర్థయాత్రవలన గలుగు పుణ్య మెద్దానం గలుగదు. అందు గాశి కలుషపిశితరాకాశి. గంగ సంసారతాపభంగ. మణికర్ణిక మోక్షలక్ష్మీశ్రుతిమణికర్ణిక. అన్నపూర్ణ యన్నపూర్ణ. భైరవుం డఘభైరవుండు. అట్టిదానిం జూడబోవుదు. నేఁడు తోడువత్తువే యని యడిగిన నతం డిట్లనియె.

స్వామీ! తమరు వాక్రుచ్చిన వాక్యంబుల కర్థం బేమియో యెరుంగను. తుది నుచ్చరించిన రాకాశి భైరవ పదంబుల కాస్పదం బయ్యవసరంబు. దీని నే నె ట్లెరుంగుదు ననిన వినుడు. మత్పితామహుం డతివృద్ధుండు. అతం డొకప్పుడు తా ననుభవించిన