పుట:కాశీమజిలీకథలు -01.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అని పలుకుచుఁ దనమూటనుండి కాంతులు విరజిమ్ము రత్నమొకండు దీసి యతనిచేతం బెట్టి యిట్లనియె.

సుయత్నా! నీ వీరత్నమును ముందిడుకొని పూజించి కన్నులు మూసికొని ధ్యానించినంత భూతభవిష్యద్వర్తమానకాలంబులం జరిగిన కథావృత్తాంతములన్నియుఁ గరతలామలకముగా నీకు దెలియఁబడగలవు. దీనిని సాలగ్రామములవలెఁ బూజించుచుండుము. ఈమణి సిద్ధించుటచే నీవు మణిసిద్ధుండ వనఁబరగుదువు. పొ మ్మింటికిఁ బొమ్మని పలికిన వాని శిరంబునఁ గరం బిడి దీవించి యంపివేసి తా నెందేనిం బోయెను.

అమ్మణిసిద్ధుండు గురూపదిష్ఠమును మంత్రోపదేశముగా స్మరించుకొనుచుఁ దదుక్తప్రకారము వెంటనే గోవిందతీర్థులను యతీంద్రునొద్దకుఁ బోయి సన్యాసము స్వీకరించి మణిసిద్ధయతీంద్రుఁడను పేరుతో బిలువఁబడుచుఁ గాశీపురంబున కరుగ నిశ్చయించి యొకనాఁడు లౌల్యమతియను మిత్రునొద్దకుఁ బోయి యిట్లనియె.

మిత్రమా! నాకుఁ జిన్నతనమునుండియుఁ గాశీపురంబున కరుగవలయునని యభిలాష గలిగియున్నది. నేఁడు గురూపదేశముగూడ నాయభిష్టమునే బలపరచినది. నే నిప్పు డయ్యాత్రకుఁ బోవుచుంటి నొంటిగాఁ దెఱవు నడువఁగూడదని పెద్దలు సెప్పుదురు. నీకు నాయోపిన యుపకారము గావించెద నప్పయనంబునకుఁ దోడువత్తువే యని యడిగిన వాఁడు నవ్వుచు నిట్లనియె.

అయ్యా! తమవేదాంత మంతయు నెక్కడికి బోయినది? తండ్రి యెన్నివిధములఁ బ్రతిమాలినను పెండ్లి చేసికొనక యావగతో నాయనను సమయజేసితివికదా! ఇప్పుడు కాశికిఁ బయనమా? దారిలో మాబోంట్లను దోడుతీసికొనిపోయి చంపుదువు గాబోలు. చాలుఁ జాలు! అయ్యా! వేదాంతులకును దీర్థయాత్రలు కావలయునా? నేను రాఁజాలనని పరిహాసమాడిన విని యాదుష్టునితో మరుమాటాడక యాయోగి వేరొకయాప్తునికడ కరిగి యభీష్టంబు తెలిపిన నతండును నాలుబిడ్డలను విడనాడి యిట్టినడికాలములోఁ బ్రయాసముల కోర్చి కాశీకి వచ్చుటకుఁ వీలులేదని కచ్చితముగా నుత్తరము చెప్పెను.

వెండియు నొకసఖునికడ కరిగియు యతనితో నిట్లనియె — ఆర్యవర్యా! ధాత్రీతలంబునఁ బ్రసిద్ధపట్టణంబు గాశియన విందువుగదా! అందు ముక్తిదాయిని యగు గంగాభవానియు మోక్షలక్ష్మీఘటనాసమర్థుండగు విశ్వనాథుండును ముఖ్యదేవతలని యాబాలగోపాలవిదితమే! తత్పురంబుఁ జూడ నీకు వేడుక లేదా? అప్పురవిశేషంబు లెన్నియేనిం గలవు. వానినెల్ల మార్గంబున వక్కాణింతు. జన్మము సాద్గుణ్యమయ్యెఁడు