పుట:కాశీమజిలీకథలు -01.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిసిద్ధుని కథ

5

గీ. భసితరుద్రాక్షమాలికాలసికగాత్రుఁ
    డురుజటాధారి వ్యాఘ్రచర్మోత్తరీయఁ
    డపరశివుఁ డన దనరు సన్యాసి యొకఁడు
    వచ్చి నివసించె నూరిదేవళమునందు.

గుణనిధి దేవతాదర్శనము నిమిత్తము నాఁటిసాయంకాలమున నాకోవెలకుఁ బోయి యందు రెండవశంకరునివలె నొప్పుచున్న యాసిద్ధుం గాంచి నమస్కరించి యోరగాఁ గూర్చుండి తత్తపోవిశేషముల నరసి స్తోత్రపాఠములు విని సంతసించుచు నింటికిఁ జని యారాత్రి దన్మహత్వమును వితర్కింపుచు మరునాఁ డుదయమున లేచి కాల్యకరణీయంబులం దీర్చుకొని యాసిద్ధునొద్ద కేగి సాయంకాలమువరకు నందే కూర్చుండి వాని విశేసంబులం జూచుచు రాత్రి కింటికిం బోయెను.

ఈరీతిఁ బదిదినములు గడచినంత నాయతీంద్రుడు వాని చిత్తనైర్మల్య మరసి యొకనాఁడు సుమతీ! నీ వెవ్వని కుమారుండవు? నాకడకు నిత్యము నేమిటికి వచ్చుచుంటివి? నీ యభిలాష యేమి? ఏమియు మాటాడక పోవుచుందువే! నీయుదంత మెఱిగింపుమని యడిగిన గుణనిధి వినయవినమితోత్తమాంగుడై యిట్లనియె—

స్వామీ! నేను యజ్ఞశర్మయను బ్రాహ్మణుని కుమారుండ. నాపేరు గుణనిధి యండ్రు. తల్లిదండ్రులు స్వర్గస్థులైరి. నా కెవరును లేరు. మీవంటి సాధువులే నాకు బంధువులు. మీయట్టి మహానుభావులు పామరుల నుద్ధరించుటకే లోకయాత్ర చేయుచుందురు. నా కేకోరికయును లేదు. ఇహపరములయందు రోత పుట్టినది. కైవల్యమునకు సులభమగు మార్గ మేదియో తెలిసికొన నభిలాష కలుగుచున్నది. మత్పురాకృతసుకృతవిశేషంబునం జేసి నాకోరికఁ దీరుపు నట్టి మహనీయులు మీరే యిటకు దయచేసితిరి. నేను గృతార్థుండ నగుదునని ముఱియుచుంటి. ముక్తిమార్గ ముపదేశింపుఁ డిదియే మదభీష్ట మిందులకే మీకడకు వచ్చుచుంటి. కృపాపాత్రుం జేయుఁడని పాదంబులం బడి వేడుకొనియెను.

అప్పు డాసిద్ధుండు వాని లేవనెత్తి వత్సా! నీ బుద్ధిపారిశుధ్య మఱసితిని. పూర్వజన్మవాసనావశంబున నీకు విజ్ఞానం బయత్నోపలబ్ధంబై యున్నయది. నీవు కారణజన్ముఁడవు. నీకు మాయుపదేశముతో బనిలేదు. ఇదివరకే నీవు మనసుచే సన్యాసి వైతివి. ఇప్పుడు కాయమునఁగూడ సన్యాసము స్వీకరింపుము. నీవలనఁ గొన్నిపురాతనగాథలు భూలోకమున వెలయవలసియున్నవి. కావున నొకసహాయునిం గూర్చుకొని ధారుణీకైలాసంబగు కాశీపురంబున కరుగుము. అందలి పరమహంసలతో నీకు సహవాసము గలిగెడిది. దాన ముక్తుడ వయ్యెద విదియే మే ముపదేశించునది.