పుట:కాశీమజిలీకథలు -01.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మోహితుండై మూర్ఖుండు తెలిసికొనజాలక సుఖమని యానందించుచున్నాఁడు. భార్య భోగములచే వీర్యమును ధనమును కుటిలభాషణములచే మనమును హరింపుచుండును. మూఢుఁడు నిద్రాసుఖవినాశమునకై దారసంగ్రహము చేసికొనును. పెక్కేల! బ్రహ్మ పురుషుల వంచించుటకే పెండ్లి కల్పించె. ఇందు రవ్వంతయైన సుఖములేదు. జనకా! జనకాదులవలె గృహస్థుండై జ్ఞానము సంపాదించుట దుర్ఘటము. మహాత్మా! కుమారుండు ప్రాజ్ఞుండని యెఱింగియు సన్మార్గ ముపదేశింపక నరకప్రాయంబగు సంసారకూపంబునఁ బడుమనియెదవేల? నాకుఁ బెండ్లి యక్కరలేదు. అనుగ్రహించి విడువు మని పలికిన విని యజ్ఞశర్మ శరీరమునఁ గంపము జనింపఁ దుఃఖముచేఁ గన్నులనుండి యశ్రువులు ధారగావించుచుండెను.

తండ్రి పరితాపముజూచి గుణనిధి యోహో! మాయమోహబల మిట్టిదే కదా! ప్రాజ్ఞులంగూడ వశపరచుకొన్నది.

శ్లో. ఆదిత్యస్యగతాగతై రహరహ స్సంక్షియతే నాయుషం
    వ్యాపారై ర్బహుకార్యభార గురుభిఃగాలోన విజ్ఞాయతె
    దృష్టాంజన్మజరావిపత్తిమరణాన్ త్రాసశ్చనోత్పద్యతె
    పీత్వా మోహమయీం ప్రమాదమదిరా మున్మత్తభూతం జగత్ .

ఆహా! నిత్యము సూర్యుని యుదయాస్తమయములచేఁ దమయాయువు క్షీణ మగుచుండ వ్యాపారపారవశ్యంబునం జేసి యాలోపము తెలిసికొనలేకున్నారు. తమ కన్నుల యెదుటనే యనేకులు బుట్టుచుండుటయుఁ జచ్చుచుండుటయు నాపదలు నొందుచుండుటయుఁ జూచియు భయమైనఁ బొందకున్నారు. జగంబంతయు నిట్లే యుండుటచే మోహమయంబగు మద్యమును ద్రాగి లోకమునకే వెఱ్ఱియెత్తినదని తలంచుచున్నారు. ఇది మాయాబలము. దీని నతిక్రమించుట కడుంగడుకష్టము. తండ్రీ! యూరడిల్లుము. నా కనుజ్ఞ యిమ్మని పలికి గుణనిధి యవ్వలికిఁ బోయెను.

యజ్ఞశర్మ పుత్రుని మనస్సన్యాసిత్వమునకు వగచుచు నప్పుడప్పుడు కుమారున కామాటయే చెప్పుచు హితులచేఁ జెప్పించుచు నిమ్నాభిముఖంబగు జిలంబునుంబోలె వానిమనస్సు త్రిప్పనేరక కులాభివృద్ధిజెందమికి విచారించుచుఁ గొండొకకాలంబున కతండు నాకం బలంకరించెను. తత్పత్నియు సహగమనము చేసి భర్తం గలిసికొని దివ్యలోకభోగముల ననుభవించుచుండెను.

తలిదండ్రులు స్వర్గస్థులైనంత గుణనిధి యాచింత స్వాంతమ్మున నంటనీయక బంధములు తెగినవని సంతసించుచు నత్యంతవిరాగము గలిగి తత్వజ్ఞానవిశేషములం తెలిసికొను నభిలాషతో గురు నన్వేషించుచుండె. నంత.