పుట:కాశీమజిలీకథలు -01.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిసిద్ధుని కథ

3

గుణ — తండ్రీ! సర్వజ్ఞుండవు నీ వెరుంగనిది లేదు. అన్నియుం దెలిసి న న్నిట్లు పెండ్లియాడుమని బోధింతువేల?

యజ్ఞ — వత్సా! వాని సాంప్రదాయములఁ దెలిసికొనుసమయ మిది కాదు. బ్రహ్మచారి గృహస్థుండై పుత్రపౌత్రాదులవలన గలిగిన యానంద మనుభవించి పిమ్మటఁ దురీయాశ్రమము స్వీకరించునపుడు దీనిం దెలిసికొనవలయును. ఇదియే లోకాచారము.

గుణ — ఏకర్మనైనఁ బ్రారంభమునందే హేతువుం దెలిసికొని చేయుట లెస్స కాదా? తన శరీరభారమును వదలించుకొనుటకు గురుతుగా వేయఁబడిన యజ్ఞోపవీత మొండు బరువై యుండు. రెండవదానిం గూడ భరింపుమని చెప్పుచుంటివా? తండ్రీ! యెఱింగియుండియు మంచిదారిఁ జూపక కంటకభూయిష్ఠమగు తెరవు జూపెద వేల?

యజ్ఞ – అయ్యో! పట్టీ! నీ విప్పట్టున నిట్టిమాటలం బలుకరాదు. గృహస్థాశ్రమ మన్నిటికి ముఖ్యమైనది. వినుము.

ఉ. స్నానముజేసి యగ్నిపరి ◆ చర్య నొనర్పుచు వేళలందుఁ గౌ
     పీనముదాల్చి వేదము జ ◆ పించుచు దండము చేతఁబూని వి
     ద్యానిధిబ్రహ్మచారి జఠ ◆ రాగ్ని జ్వలింపఁగ బిక్షగోరి యె
     వ్వానిగృహంబు జేరుఁ దల ◆ ప న్మఱి యట్టి గృహస్థుఁ డల్పుడే!

గీ. ఉర్వి గృహపతి చల్లఁగా ◆ నుంటగాదె
    సాగుచున్నది తాపస ◆ జనతపంబు
    యతుల నియమంబు వడుగుల ◆ వ్రతము భిక్షు
    కులప్రవాసంబు మహిఁ దైర్థి ◆ కులప్రసేవ.

గీ. కాన గృహపతి యందఱి ◆ కన్న నధికుఁ
   "డన్న మన్న మటంచు గృ ◆ హంబుఁ" జేరు
   నతిథిఁ బూజింపు మెపుడు స ◆ త్యముగ దానఁ
   గలుగు సుకృతము కోటియా ◆ గముల రాదు.

తండ్రీ ! సర్వదా దుఃఖభూయిష్టమై వాగురాసమానమగు సంసారమున నేను బ్రవేశింపఁజాలను. అందు బ్రవేశించినవారికి ధనార్జనాసక్తి యుండక తప్పదు. ఎట్లో యొక్కకడుపు పూరించుకొనవచ్చును కాని భార్యాపుత్రాదికుటుంబము పెరిగినప్పుడు వారిం బోషించుటకై గృహస్థు డెట్టికప్టముల బడవలయునో తలంచికొనిన భీతి పుట్టుచున్నది. నిత్యము భార్య జలగవలె రక్తమును బీల్చుచుండఁ దద్భావచేష్టితములచే