పుట:కాశీమజిలీకథలు -01.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యజ్ఞశర్మ - వత్సా! నీ కిప్పుడు వివాహము సేయ నిశ్చయించుచుండ మీ యమ్మతోఁ బెండ్లియాడనని చెప్పుచుంటివఁట. ఏమిటికి?

గుణనిధి – తండ్రీ! పెండ్లి యేమిటి కాడవలయును?

యజ్ఞ – సుఖించుటకు, అనందించుటకు.

గుణ - ఏమి సుఖము? ఏమి యానందము?

యజ్ఞ - లోకమంతయు నేసుఖము నేయానందము బొందుచున్నదో నీవు నదియే!

గుణ — తండ్రీ! నేను గొన్నిశ్రుతిసాంప్రదాయముల నడిగెదఁ గోపగింపక తెల్పెదరా?

యజ్ఞ — కోపమేల? అడుగుము.

గుణ – నా కుపనయనము చేయునప్పుడు నామెడలో మూడుపోగులుగల యీయజ్ఞోపవీతము నేమిటికి వైచిరి? దీని సాంప్రదాయ మేమి?

యజ్ఞ - దేహతత్వమిందుఁ దెలుపఁబడుచున్నది. తంతుత్రయము సత్వరజస్తమోగుణములు. వానిలోని తంతువులు సత్యాదిభేదము లనియుఁ దొంబదియారుబెత్తలు తత్వముల సాంకేతిక మనియు దానిముడి యజ్ఞానగ్రంధి యనియు నుపనిషత్తులలో వ్రాయఁబడియున్నది. నీవు చూడలేదా?

గుణ — చూచితిని వివరము తెలిసినదికాదు. వివాహమందు రెండవయజ్ఞోపవీతము వైతు రది యేమి?

యజ్ఞ - అట్టి తత్వములుగల మరియొక్కదేహము భారము వానిమీదఁ బడుచున్నదని తెలుపుటకు.

గుణ —తండ్రీ! వివాహమన శబ్దార్థ మేమి?

యజ్ఞ - ఎడతెగని బరువును మోయుట, అని.

గుణ - స్వామీ! ఈయజ్ఞోపవీతముల నిట్లు పురుషులకు మెడలో వేయుట కేమి ప్రయోజనము?

యజ్ఞ — విద్వాంసుఁ డామాటయే శంకించుకొని వావివలనఁ బంధములఁ దెలిసికొని తత్వ మెరిఁగిన జ్ఞానవంతు డగుటకు. అందులకే యామర్మము తెలిసినవా రగుట సన్యాసులు జన్నిదములఁ దీసివైతురు. దానం జేసియే “జగ మెఱిఁగిన పాఱునకు జందె మేల” యను సామెత వచ్చినది.