పుట:కాశీమజిలీకథలు -01.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథాప్రారంభము

మణిసిద్ధుని కథ

క. శ్రీకర శశిశేఖర కరుణాకర వారాణాసీపురాకర గౌరీ
   శా కరధృతమృగ గంగాశీకరవిలసజ్జటావిశేష సువేషా!

వ. దేవా! యవధరింపుము. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన కాశీయాత్రాచరిత్రంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన తొల్లి కొల్లాపురంబున యజ్ఞశర్మయను విప్రుండు గలడు. అతండు వేదవేదాంగంబుల సాంతముగాఁ బరిశీలించి తదుక్తధర్మంబుల ననుష్ఠింపుచు సాధుమార్గంబునఁ బెక్కుధనంబు సంపాదించి సంపూర్ణదక్షిణలతో విధ్యుక్తయాగంబులఁ బెక్కు గావించి శ్రోత్రియవిద్వాంసులలో నుత్తముఁడని వాడుక వడసి కాపురము సేయుచుండ జిరకాలమునకు వీతిహోత్రుని యారాధనావిశేషంబున నతని కొకపుత్రుం డుదయించెను.

యజ్ఞశర్మ మిగుల సంతసించుచు దానధర్మములచేఁ బేదలఁ దృప్తిపరచి జాతకర్మానంతర మాశిశువునకు గుణనిధి యని పేరుపెట్టెను. అగ్నిప్రసాదసంజనితుండగు నబ్బాలుండు శుక్లపక్షక్షపాకరుండువోలె ననుదిన ప్రవర్ధమానుండగుచు నధికతేజస్సమున్నతంబగు నాకారంబు నాకారంబునకెనయగు ప్రజ్ఞయుఁ బ్రజ్ఞానదృశంబులగు గుణంబులుం గలిగి తనపేరు సార్ధకము గావించి తలిదండ్రుల కానందము గలుగఁజేయుచుండెను.

అగ్గుణనిధి యుక్తకాలంబున నుపనీతుండై యధావిధి బ్రహ్మచర్యవ్రతం బాచరించుచు విద్యాభ్యాసంబు గావించుచుండఁ బూర్వజన్మపరిచితంబగు విద్యలు చంద్రునిఁ జంద్రికలువోలెఁ గ్రమంబున నతని నాశ్రయించినవి. అతని పాండిత్యము అనన్యజనదుర్లభంబగు జ్ఞానప్రబోధమునకు హేతువై యొప్పుచుండెను. అతండు సంతతము తత్వవేతృత్వమునుగురించి పరిశ్రమఁ జేయుచుండును. ఒకనాఁడు తండ్రి కుమారుని వివాహము జేసికొమ్మని బోధించిన వారిరువురకు నిట్టి సంవాదము జరిగినది.