పుట:కాశీమజిలీకథలు-12.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

పైకిఁదీసి వానికి వివిధోపచారము లొనర్చుచుండఁ గొండొకవడికి స్మృతివచ్చినది. పిమ్మట నాబాలకుండు ముందున్న మునివల్లభుంజూచి భయాశ్చర్యస్వాంతుడై మేమియుఁ బలుకఁజాలక వడకుచు నిలువంబడియుండెను.

రత్నచూడు డాబాలకున కుదుటుగరపుచు నిజపర్ణశాలాభ్యంతరమునకు దోడ్కొనిపోయి కందమూలాదుల వానిని బరితృప్తుని జేసెను. పిమ్మట వాని వృత్తాంత మెరింగి యురగరూపమున దనచే వెనుక బ్రాణములు హరింపబడిన వనాటబాలకునిగా వాని నిరూపించి వాడెట్లు పునర్జీవితుండయ్యెనో తెలిసికొని నుత్సుకతం బొందుచు నిజ యోగవిద్యాప్రభావమున జరిగిన వృత్తాంతమంతయునుగ్రహించి మందహాసభాసుర వదనపంకేరుహుండగుచు నల్లన వాని కిట్లనియె.

బాలకా ! నీవు కడుపుణ్యాత్ముండవు. మనుష్యదుర్లభంబగు దివ్యలోకమున కేగివచ్చితిని. స్వప్నా పయముగ బాముకాటువలన జచ్చి పునర్జీవులగుట యదృష్ట హేతువని చెప్పుదురు. దేవతలనందర నాంక్షబెట్టిన దివోదాస ధాత్రీకళత్రుండు నీకొరకై పడరాని యిడుమలంబడుచున్నాడన నింక నీసుకృత విశేషమునకు నిదర్శన మేమి కావలయును? తొలుత నెవ్వాని యాభిలవిష జ్వాలలంబడి మడిసితివో యానాగ శ్రేష్ఠుని శిరోమణి ప్రభావముననే పిదప జీవించితివి. నీకికమీఁద నేయాపదయుం గలుగ బోదు. అనతికాలముననే మీ బందుగులం గలసికొందువు. నీకొరకై వెదకుచున్న దివోదాసుడు శీతశైలాగ్రమున నున్న శాంభవీదేవియాలయమున నిప్పుడున్నవాఁడు. నిన్ను మదీయ యోగప్రభావమున నిప్పుడే వానిసన్నిధికిం దోడ్కొనిపోయెద. గనులు మూసుకొమ్మని పలుకుచు నాశబరబాలకుని మందసముతోగూడ నాదేవభవనమునకు దృటిలో దీసికొని పోయెను.

అచ్చట దివోదాసుడు దేవీమండపముమీద నుపవిష్టుడై యుండి యరిందము నితో నెద్ధియో ముచ్చటించుచుండెను. మణిగ్రీవ జలంధరులతో గుణవతి నలకాపురము నకు బుత్తెంచిన పిమ్మట నమ్మహారాజు యక్షసచివునితో బయలుదేరి యరణ్యమందొక మార్గముననుసరించి నడచుచు గ్రమమున శాంభవీదేవి యాలయమున కప్పుడే వచ్చి చేరును అందుండు దివ్యకాంతల యుదంతమెరింగిరమ్మని యరిందమునితో బలుకు చున్న తరుణమందే శబరబారకునితో రత్నచూడు డచ్చటికివచ్చెను

దివోదాసుండు రత్నచూడుని పోలిక గ్రహింపజాలక కేవలమొక తాప సోత్తముడచ్చట దనకు బ్రత్యక్షమయ్యెనని తలంచుచు భయభక్తి వినయంబులు మనంబున నొక్కసారి జనింప దిగ్గునలేచి వానిపాదములకు సాష్టాంగపడెను అరింద ముండు పేటికాహస్తుడై యున్నశబరబాలకుని జూచినతోడనే గుర్తింపగలిగెను. ప్రేత సంరక్షణమునకై తనచే దొల్లికల్పింపబడిన మందసముసు గాంచి విస్మయమందెను. ఎవ్వని నన్వేషించుటకు దివ్యభువనములన్నియును దిరిగి యుంటిరో, యెవ్వని క్షేమము నకై దివోదాసమహారాజు మిగుల నాత్రమందుచుండెనో, యెవ్వని మూలముగా సర్వ