పుట:కాశీమజిలీకథలు-12.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శైలకందరము కథ

101

జలంధరుండు తనపూన్కెయంతయును విఫలమైనదని నుడివి యిప్పుడే యిచ్చటి కేతెంచి మణిగ్రీవుని గలసికొంటినని తానొర్చినప్రముత్నము లన్నియును దివోదాసున కెరింగించెను. మణిగ్రీవుండును గుణవతి కొఱకై యరణ్యమధ్యమందారాత్రి యంత యును దాఁబడిన యిడుమల నా మహారాజున కెరింగించెను.

పిమ్మట దివోదాసుండు శబర బాలకుండు దొరకువఱకుఁ దాను నిజరాజ ధానిని జేరవీలులేదని చెప్పుచు గుణవతిని చెలికత్తియతో దివ్యయానంబున నలకాపురంబు నకుఁ దీసికొనిపొమ్మని మణిగ్రీవునితోఁ జెప్పెను. అందులకు గుణవతి మొదట సమ్మ తించినదిగాదు. శబర బాలకుని వానియాప్తుల సన్నిదిఁ జేర్చిన వెంటనే నేను నీకొఱకు యక్షలోకంబున కేతెంతునని నమ్మకముగలుగునట్లు దివోదాసుఁడు వచించుటచేత నామె యెట్టకేల కంగీకరించినది. అప్పుడు మణిగ్రీవుండు గుణవతిని జిత్రలేఖను విమాన మెక్కించుకొని జలంధరుండు వెంటరా నలకాపురంబున కేగెను. దివోదాసుండును నరిందముని దనవెంటనుంచుకొని శబరబాలాన్వేషణంబున కరుగఁదలచి యందుఁ గన బడిన యొకమార్గము ననుసరించి ముందు బోయెను.


318 వ మజిలీ

రత్న చూడుని కథ

వింధ్యారణ్యంబున రత్నచూడుఁడు మౌనిసత్తముడనఁ బ్రసిద్ధి కెక్కి యుండెను. దివోదాసునిచేఁ బుడమి నుండుట కనుమతిఁ బడసియున్నకతంబున నా నాగోత్తముఁడు నిర్భయముగా నందొక యుచితస్థలంబునఁ దపంబొనరించుచుఁ గాలము బుచ్చుచుండెను. దివోదాసుని బలవిక్రమ ప్రభావములు దలంపునకు వచ్చినప్పుడెల్ల నతండు మిగుల నక్కజంపడుచు వానిని దైవసమునిగా నెన్నుచుండెను. ఆరాజేంద్రుని సుగుణగుణములఁ బలుమారు ప్రస్తుతింపుచుండెను. తనకతండొనరించిన యుపకారము నకుఁ బ్రతి యెన్నఁడైనఁజేసి వానియందుఁ దనకుఁ గల కృతజ్ఞతను వెల్లడింపవలయు నని యతండు సమయమును బ్రతీక్షించియుండెను.

ఇట్లుండఁ గొన్నిదినముల కొక సంధ్యాసమయమున నా నాగకులప్రదీప కుండు ప్రాంతసరోవరమునకుఁ బోయి వచ్చుచుండ నంతరిక్షమునుండి యెద్దియో నీటిలోఁ బడిన ధ్వనియగుటయు నతండదరిపడి వెనుకకుఁ దిరిగిచూడ నాపద్మాకరమున నొకమందసము మునుఁగుచుఁ దేలుచు గోచరమయ్యెను. రత్నచూడుఁ డాపెట్టెను సమీపించి దానిని బట్టుకొని తీరమునకుఁజేరి మూఁతఁబైకెత్తి చూడ నందొక మనుష్య బాలకుఁడు కరగతప్రాణుఁడై యుండుట పొడకట్టెను. తోడనేయతండాబాలకు నందుండి