పుట:కాశీమజిలీకథలు-12.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మనకు ముఖ్యములే యగుటం జేసి మనము మువ్వురము నిందులకు బూనుకొనవలయు నని వారికి నచ్చునట్లుపన్యసించితిని. నామాటలకు వారిర్వురును సమ్మతించిరి. నాయందు వారికెంతేని భక్తి విశ్వాసములు గుదిరినవి. నాయాజ్ఞ నిసుమంతేని మీరక నమ్మకముగా మెలంగుటకు బాసఁజేసిరి. అప్పుడు నేను మణిగ్రీవుని మీనిమిత్తము బంపి జలంధరుని శబర బాలకాన్వేషణంబునకు నియమించి నే ననంగమోహినిని వెదకుటకుఁ బూను కొంటిని మేమువ్వురమును విమానమెక్కి. యనంగమోహిని మాయమైన హిమగిరి కంతరమున కేగితిమి. అందు నేను దిగి తక్కినవారిని వారిపనిమీఁదఁ బంపి వేసితిని. వారి జాడ నాకు మఱల నిప్పటివఱకుఁ దెలియలేదు. నేను నగ్గుహాంతరమునకేగి విమర్శింపుచుఁ బోవుచుంటిని. కాని యనంగ మోహిని యునికి నాకెచ్చటను గనంబడ లేదు. చీఁకటిలో నా గుహాబిలంబునఁ బడిపోవఁబోవఁ జివరకు నేనొక దేవతాలయ ప్రాంగణంబునకుఁ జేరుకొంటిని. ఆ దివ్యాలయములోనికి బోయి యందున్న శాంభవీ దేవిని స్తుతించుచుండ నచ్చటికెవ్వరో వచ్చుచున్న సందడియగుటయు నచ్చట నేమి జరుగునో చూడవచ్చునని గొబ్బున నాదేవీ విగ్రహము వెనుకకు బోయి యందుఁ బొంచియుంటిని.

ఇంతలో నల్వురు దేవకాంతలచ్చటికివచ్చి భక్తితత్పరలై యాయమ్మవారి నర్చించి యనుకూలవాల్లభ్యంబుదయసేయుమని ప్రార్థించుటయు వారియెదుటకుఁ దానరిగి వారిచే వరింపఁబడుటయుఁ బిమ్మట యంత్రబిలమునందుఁ జొచ్చి హేమసౌధ విశేషముల గ్రహించుటయుఁ దరువాత నరిందముని యాపదఁ దప్పించి వానితోఁ దిరుగఁ బైకివచ్చుటయును మొదలగు వృత్తాంతమంతయును వారికెఱింగించి మఱియు నిట్లనియె.

అట్లు నేనరిందమునితో భూవివరంబు వెల్వడి వచ్చిన యనంతరము దేవ కన్యకలు దేవీపూజకై యాలయంబునకరిగిరి. వారివెనుక మేమును నాగుడిలోని కేగఁ దలచి వేఱొక ద్వారంబునఁ బ్రవేశించితిమి. కాని యామార్గమున మా కెచ్చటను వెనుకఁ జూచిన యూలయము గనంబడలేదు. ఆదారి క్రమంబున మమ్మీయరణ్యము నకుఁ దీసికొనివచ్చినది. ఇచ్చట మీరుకనంబడుటచే మాయాగమనంబు వ్యర్థము గాలేదని పలికి యా యక్షకాంతలకు సంతోషముగలుగఁ జేసెను.

ఇంతలోఁ జీఁకటిపడినది వారతికష్టముమీఁధ నొకమార్గమునం బడి కొంత దూరమరిగిరి. కాని ముందిఁక నడచుటస శక్యముగాలేదు. అచ్చటనొకవిశాల వృక్ష మూలంబున నారాత్రిగడపి యుదయమున నచ్చటనుండి బయలదేరి వారుముందుఁ గొంతదూర మరిగిరి అచ్చట వారికొక సుందరసరోవరంబు నేత్రపర్వమొనర్చెను. దా పరిసరంబున నిర్వురుపురుషులు దిరుగుచుండుట జూచి వారిని మణిగ్రీవజలంధరులుగా నిరూపించి దివోదాసుండు తక్కినవారితో నందేగెను. మణిగ్రీవజలంధరులు వీరిని జూచి మిగుల నానందమును బొందిరి. విమానయానంబున శబరబాలకుని నిమిత్తమై యరిగిన