పుట:కాశీమజిలీకథలు-12.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శైలకందరము కథ

99

మిత్రమా ! నిజమెరుంగక నన్నిట్లు నిష్టురము లాడదగునా ? అనంగ మోహినీ వృత్తాంతము నీకన్న నే నెక్కుడెరుంగుదునా ! మిమ్మిరువుర నగ్గిరికందర మున విడిచి నేను ఫలాన్వేశణంబున కేగియుండలేదా ? నేనచ్చటికి‌ దిరుగవచ్చుసరికి మీ రిరువురు నందు నాకు గనబడిరా ? నన్ను మోసపుచ్చి యచ్చపరాక్షిని నీవెచ్చటికో తీసికొనిపోతివని దలంచి మనంబున నాకంబుగ్రీ‌వపై విరక్తిబుట్ట నెట్టకేల కిప్పట్టునకు దిరిగి వచ్చియున్న నాపై నిందలమోపుట న్యాయమగునా? అనంగమోహిని యేమై నదో నే నేరుంగను. నీవా కందరము విడచి యెచ్చటికేగి యిప్పుడిక్కడకు వచ్చి యుంటివో గ్రహింపజాలను. నీయుదంతము నాకు వింత గొలుపుచున్నదను జలంథ రుని మాటల నాక్షేపించుచు మణిగ్రీవుడు వెండియు నిట్లనియె.

ఓరీ ! నీగడుసుమాటల నిక గట్టిపెట్టుము. నీ యుక్తులకు మోసపోవు వారెవరిందు లేరు. హిమవంతము నుండి‌ నీవిచ్చటకు విరక్తుండవై తిరిగివచ్చి యుంటివని చెప్పుచుంటివే ? అప్పుడు విమానము మీద నీపాదములమ్రోల నడ్డముగా బరుండబెట్ట బడియున్న వ్యక్తి నెవ్వరును జూడలే దనుకొనుచుంటివి కాబోలును. మిత్రద్రోహివై నీవా యళికుంతల నందు బెట్టుకొని యంతరిక్షమున కేగియుండుట నేను గ్రహింప గల్గితినని నీకిప్పటికైన నమ్మకము గలుగుటలేదా ! నాతో నిక వ్యర్థ వాదమునకు బూనక యాకనకగాత్రిని వేగమే మా కప్పగింపుము లేదేని నీ మాన ప్రాణంబులు దక్కవని నిక్కముగ నమ్ముమని గద్దించి పలుకుచున్న వానికి జలం ధరుం డిట్లనియె.

మిత్రమా ! విమానముమీఁద నేనంబరమునకుఁ గొనిపోయినది యనంగ మోహినీ స్వరూపమని భ్రమించుటంజేసి నీవిట్లు నాపైఁ గినుకఁ జూపుచుంటివి. కాని యందున్న దొక మనుష్యబాలకునిఁ బంధించియుంచిన మందసమని యెరింగిన నీ భ్రమ నివారణ కాఁగలదని పలికినతోడనే నేనదరిపడి యీవృత్తాంతము సాంతముగాఁ జెప్పుమని యడిగితిని. మణిగ్రీవుండును దాని నెరుంగ గుతూహలపడెను. అప్పుడు జలంధరుండు జరిగినవృత్తాంతమెల్ల మాకు దెలియఁజేసెను. వాని మాటలు మణి గ్రీవుఁడును నేనును విశ్వసించితిమి. అప్పుడు నేను జలంధరునితో వెండియు నిట్లంక్ష్టిని.

చెలికాఁడా ! ఒకవిషయము నెరుంగఁగోరిన మఱియొక యదంతము నీ వలన మాకుఁ దెలిసెను. ఈ వృత్తాంత మెఱుంగుటకే నే ని‌ట్లు లోకాంతరంబులఁ గ్రుమ్మరుచుంటిని అందున్న శబర బాలకుని వాని యాప్తుల సన్నిధిఁజేర్చుటకు నేను శపథము జేసియుంటిని. ఆపెట్టెలోఁ బెట్టి నీవు వానిని దివంబునుండి క్రిందకుఁ బడఁ ద్రోసితివి. వాఁడెచ్చట పడెనో యేమయ్య నో కనుంగొనవలయును. మఱియు ననంగ మోహిని యాకందరాంతరమున నే మయ్యెనో తెలిసికొనవలయును. ఇదియునుంగాక గుణవతి కాననాంతరంబున దిక్కెవ్వరును లేక యెంత యడలుచున్నదో గదా ? ఆమె క్షేమము నరిసి సురక్షితమగు తావునకుఁ జేర్పవలయును. ఈ మూడు కార్యములును