పుట:కాశీమజిలీకథలు-12.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నచూడుని కథ

103

సౌఖ్యముల నా యనఘుండు పరిత్యజించి యడవులపాలయ్యెనో యట్టి శబరబాలకుని గట్టెదుటంగాంచి యరిందముడు మహానందమున “ఇడుగో శబరబాలకు"డని యొక్క కేకబెట్టి వానిసన్నిధికురికి నిజకరద్వయమున నాబాలకుని మూపులంబట్టి యూప దొడంగెను.

రత్నచూడుడు దివోదాసుని లేవనెత్తి తనకు వానియందు గల గాఢాను రాగము దెల్లంబగునట్లు శిరమునిమురుచు నిట్లనియే. మహారాజచంద్రమా ! నీయుదార స్వభావమున‌ నే నెంతయును సంతసించితిని. జడదా రూపమున నున్న నాకు నీవిందు బ్రణమిల్లుట సమంజసమే కాని నేనందుల కర్హుండనుగాను సుమా ! భవదీయ బలప్రతాప ప్రభావములచే మొదట నిర్జింపబడి‌ క్రమ్మర ననుగ్రహింపబడిన యొకపాపజాతి పురు షుండు నీకెట్లు వందనీయుడగును. నేను నీకు మిత్రుడను, ఆశ్రితుడను, సేవకుడను, రత్నచూడుడ‌ను నాగవంశమువాడను. నీయనుగ్రహము మూలముననే నేనీ భూతల మున నివసించుచున్నాను. సర్వదా నీకు హితమునే తలంచుచు మునివృత్తిని వింధ్యా రణ్యప్రదేశమున నున్న వాడనని తనవృత్తాంతమెరింగించి శబర బాలకుని వానియెదుట బెట్టెను.

అప్పుడు దివోదాసుండు మిగుల బ్రీతుండగుచు రత్నచూడున కిట్లనియె. మిత్రమా! నీభావనైర్యల్యము ప్రశంసాపాత్రమైయున్నది. శబరబాలకాన్వేషణమునకై తహతహం పడుచున్న నా హృదయమునకు నేడు నీవు సంతోషమొనగూర్చితివి. వాని కొరకై మేము పడుచున్న యిబ్బందియంతయును నీయాగమనము మాత్రముననే తీరి పోయెను. నీకు నేనొనర్చిన మే లత్యల్పమైనది. నాకు నీవిం దొనరించిన ప్రత్యుప కారము మిగుల నుత్కృష్టమైనది.


చ. పుడమియురాజ్యమున్‌ విడచి భోగవిశేషములన్‌ ద్యజించి కా
    రడవుల సంచరించుచు ఫలాదులఁ గు నినింపుకొంచు నే
    నిడుమలఁ బొందుటెల్ల భవదీయ దయాప్తిఁదొలంగె నేఁటికే
    ర్పడ ముదమబ్బె నీ శబరబాలకు నేనిటఁ గాంచఁగల్గుటన్‌.

ఆ. వె. అనుపమానమైన యనురాగ మొప్ప నీ
         శబరబాలు దెచ్చి‌ సాధుమతిని
         నాకొసంగు టరయఁ బ్రాకటంబుగ మూడు
         లోకముల నొనంగుటే కదయ్య!

నీవు నాకీతీరున జేసిన యుపకారము నెన్నడును మరువజాలను. నీమూల మున నేను వనాటులతో జేసినప్రతిజ్ఞ నెరవేరినది. ఇక నాకు గారడవుల సంచరింప బనిలేదు. అని పలికి స్మృతినభినయించుచు నయ్యో! అనంగమోహినిమాట మరచితిని. అయ్యోషారత్న మెచ్చటనున్నదో తెలిసికొని యామె యాపద దప్పింపకుండ నేనెట్లు