పుట:కాశీమజిలీకథలు-12.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ముల మీజాడ యేమైనఁ దెలియునేమో చూచిరమ్మని విమానముమీదఁ బంపించి యామెరాక నిరీక్షించియుంటిని. ఇంతలో నీవును జిత్రలేఖయును నేకకాలముననే యిచ్చట నాకుఁ దిరుగఁ గనంబడిరి. అనంగమోహిని జాడయేమైనఁ జిత్రలేఖ యెరింగి వచ్చెనేమో యామెయే చెప్పవలయునని యూఱకుండెను. అప్పుడు చిత్రలేఖ గుణవతితో నిట్లనియె.

ప్రియసఖీ ! నీయానతి వడువున దివ్యయానంబెక్కి యనంగమోహిని కొఱ కీప్రాంతములయం దతి శ్రద్దతో వెదకుచుండగా నొకవైపు నుండి విమానము మీద మిగుల వేగముగాఁ బోవుచుండిన జలంధరుండు నాకెదురయ్యెను తొందరగాఁ బోవుచుండుటచే నతఁడు నన్ను గమనించి యున్నట్లు తోచదు. నేను వాని నీక్షించి యనంగమోహని యుదంతము నతండెరింగి యుండవచ్చునని ప్రచ్చన్నముగా వాని విమానము వెనుక మదీయ దివ్యయానమును గొంతదూరము బోనిచ్చితిని. మణి గ్రీవుఁడు లేకుండ జలంధరుఁడట్లొంటరిగాఁ బోవుచుండుట నాకెంతేని వింతగాఁ దోచెను. అనంగమోహిని మూలమున వారిద్దరి కేమైనఁ దిరుగ కలహము సంభవించె నేమోయని సంశయించితిని. వాని దివ్యయానము దిన్నఁగా నాకసంబున నుత్తరపు దిక్కుగాఁ బోవుచుండుట చేత నతఁడు యక్షలోకమునకే యరుగు చున్నాఁడని నిశ్చ యించి నేను వెనుకకు మరలి వచ్చితిని. వాని విమానముమీద నెద్ధియో యున్నట్లు గనంబడినది కాని నేను దానికిఁ జాలదూరమున నుండుటచే నది యేమైనదియును‌ గుర్తింపఁజాలనైతిని. ఆతఁడట్లెచ్చటనుండి వచ్చుచుండెనో యావిమానము నందుఁగల వస్తువేమో విమర్శింపవలసియున్నది. ఈ వృత్తాంతము నీకెరింగించుటకే నేనిందు వెంటనే తిరిగివచ్చి యిచ్చట మణిగ్రీవుని నీసమీపమునఁ జూచితినని యూరకుండెను. ఆ మాటలువిని మణిగ్రీవుం డిట్లనియె. ‌ చిత్రలేఖా ! జలంధరుని యొద్దఁగలవస్తు నెట్లుండెను. నా సన్నిధినుండి ఫలమూలాదులంగొని వచ్చుటకే గదా యతఁడు విమానము మీఁద నరిగియుండెను. అందున్నది వివిధ వన్యఫలాదుల పోవులేమోయని తలంపఁ గూడదాయని యడుగు టయుఁ జిత్రలేఖ తల ద్రిప్పుచు నట్టివేమియును గాదని మాత్రము రూఢిగాఁ జెప్పఁ గలను. అందున్న వస్తువించుక దీర్ఘముగా నుండి వాని పాదసమీపమున నడ్డముగాఁ బడియుండెనని బదులు చెప్పినది. అప్పుడు మణిగ్రీవుండు హృదయోద్వేగమున నొడలు గంపమొంద గుణవతితో నిట్లనియె.

చూచితివా ! జలంధరుని మిత్రద్రోహము ! నేనిచ్చటికి జేరిన మార్గముననే యా మానినీరత్న మేతెంచియుండుట వాడు విమానము మీదనుండి తిలకించి సన్నిధి కేతెంచి యామెను బలాత్కరించి యుండును. వానిని మొదటినుండియును దిరస్క రించుచున్న యా యన్నులమిన్న వానినొల్లక భయోద్రేకమున మేనెరుంగక పడి యుండును. అప్పట్టున వాడామెను విమానమున బరుండబెట్టుకొని యెచ్చెటికో యెత్తు