పుట:కాశీమజిలీకథలు-12.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ననంగమోహిని యా మార్గముననే పోయియుండునని తలంచి యామెను ముందు గనుంగొన వచ్చునను నాశతో నతిరయంబున నడచుచుఁ గొండొకవడి కా బిలంబునిర్గ మించి యొక కాసారతీరమును జేరుకొనగల్గెను.

ఆ సరోవర సమీపమున రమణీయ సైకతస్థలమున నొక తరుణీమణి కూర్చుని యుండుట దిలకించి మణిగ్రీవు డామె యనంగమోహిని యను నాశతో నమందగమనమున సన్నిధికేగెను. తావలచిన లలనామణి యొంటరిగ నట్టి రమణీయ ప్రదేశమున లభింపగల్గెనను నుత్సాహముతో నే తెంచిన యా యక్షకుమారునకు తోడనే మిగుల నాశాభంగము సంభవించెను. తలవనితలంపుగా వాని కచ్చట గుణవతి ప్రత్యక్షమయ్యెను. తనసోదరి యందు గనంబడిన వెంటనే వానికి వచింప నలవి గానంత మనోవైకల్యముగలిగెను. అమాంత మామెపైబడి మడియింప వలయునను నంతటి పాపచింత హృదయమునబుట్టెను. ఆయోషామణి యావలమోమైయుండి యెవ్వరి కొరకో నిరీక్షించుచుండుటచేత మణిగ్రీవుని యాగమనంబామె మొదట గ్రహించియుండ లేదు. ఇంతలో నామె చెలికత్తెయగు చిత్రలేఖ యచ్చటికి వచ్చి యచ్చిగురాడుబోణి వెనుక గ్రోధారుణ దుర్నిరీక్ష్యవదనుడై నిలువబడియున్న మణిగ్రీవుని దిలకించి కించిద్భయ విస్మయావేశహృదయాంబుజాతయై యొడలు కంపమొందుచుండ దీవ్ర గమనమున వారిని సమీపించి గుణవతి నుద్దేశించి నెచ్చెలీ ! నీ వెనుకనున్న సోదరునిం దిలకింపలేదా? జ్యేష్టసోదరుడు తండ్రితోసమానుడని యెరింగి యుచితరీతిని సన్మానింప వలయుననుట దెలియదా యని మందలించుచున్నట్లామె నుద్భోధించెను.

ఆమాటల కులికిపడి లేచి గుణవతి‌ చేరువనున్న యన్నగారింజూచి 'యనంగమోహిని నెందుదోడ్కొనిపోతి'వని గద్దించి యడిగెను. అనంగమోహిని పేరు వినినతోడనే వాని యాగ్రహమంతయు నంతరించెను. దృఢపరీభవ వ్యధాకలిత హృద యుఁడై గద్గదస్వరంబున‌ నామె యేమైనదో తెలియదని యతఁడు బదులు చెప్పెను. ఆ మాట విని గుణవతి దండతాడిత భుజంగము వడుపున మండిపడుచు నిట్లనియె.

నీచుఁడా ! సహోదరినగు నామాటయైనఁ బాటింపక యవినీతుడఁవై యబలల మగు మమ్ముగొట్టి యా చకోరాక్షిని బలిమిమై మ్రుచ్చులించుకొని పోయి యిప్పు డేమియు నెరుంగనని చెప్పుట నీ దుష్టస్వభావమును స్పష్టపరచు చుండెనుగదా ! ఆ నారీశిరోమణి నెందుఁ దోడ్కొనిపోతోవి ? ఏమి చేసితివి? నిక్కము వచింపుము లేకున్నఁ బెద్దలయొద్ద నీకు బుద్ధి జెప్పింపఁగలనని కసరుచున్న చెలియలితో మణిఁ గ్రీవుండనునయ పూర్వకముగా నిట్లనియె.

సోదరీ! నాపై నేమిటికిఁ గినుకఁ జూపెదవు. నే నిప్పుడు నీతో సత్యమునే పలుకుచుంటిని. మూఢుండనై యావేదండయానను దోడ్కొనివచ్చి యిమ్మహారణ్య మధ్యమునం దామె నెడఁబాసితిని. జలంధరుఁ డేమయ్యెనో తెలిసికొనఁ జాలనైతినని తనవృత్తాంత మా మూల చూడముగా వక్కాణించి మరియు నిట్లనియె. ఆ నవకుసుమ