పుట:కాశీమజిలీకథలు-12.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శైలకందరము కథ

93

గడంగిన నాకుఁ దగిన యనుభవమైనదని నిందించుకొనుచుఁ గొంతతడ వొడ లెరుంగక పడియుండెను.

ఫలములకై పోయిన జలంధరుండు గుహాముఖమున కేతెంచి యందు మణి గ్రీవుఁడు గాని యనంగమోహినిగాని కనంబడకుండుటకు విస్మయమందుచు మణి గ్రీవుండు నిక్కముగఁ దన్ను మాయఁజేసి యా సరోజాననఁ దీసికొనియెందో పోయె నని నిశ్చయించి వాని ననేక విధముల నిందించుచు నమ్మదవతితో గలియుభాగ్యము దనకు‌ లేకపోయెనని వగచుచుఁ దానిఁక నందుండిఁ బ్రయోజనము లేదని తలంచి నిస్పృహుఁడై నిజలోకమునకు మరలిపోవనెంచి యంతలో వారినయ్యరణ్యమున వెదకి కనుఁగొన వలయునను నూహ జనింప దివ్యయానంబెక్కి వారికొఱకై యాప్రాంత ముల యందుఁ దిరుగుచుండెను.

అట్లు విమర్శించుచుండ ముందొకచోటఁ బేటికాహస్తుండగు శబరబాలకుండు వానికిగోచరమయ్యెను. వానింజూచి మొదట యనంగమోహినిని గైకొనిపోవు మణి గ్రీవుండని తలంచి పటురయమున వాండున్న చోటకు జలంధరుఁడు విమానమును బోనిచ్చెను. కానియందున్నవాఁడు యక్షలోకమునుండి భూలోకమునకు వెనుక దాము గొని తెచ్చిన వానిఁగా నిరూపించి విమానమునుదిగి వాని సమీపమునకు బోయి యోరీ ! నీవింకను జీవములఁబడసియే యుంటివా ? మేమప్పుడు నిన్ను పైనుండి విసరివేయక విమానమెక్కించి యిచ్చటకుఁ దీసికొనువచ్చుట మాదే తప్పు. ఇఁక నేటితో నీజీవితావధి తీరినదని పలుకుచు భయకంపితుఁడై యొదిగియున్న యా శబర బాలకుని బట్టి యా పెట్టియందుఁ దిరుగఁబెట్టి యంతరిక్షమునకు విమానముమీదఁ దీసి కొనిపోయి యా పెట్టితో వానిని గ్రిందకుఁ ద్రోసివేసెను. పిమ్మట జలంధరుం డనంగ మోహినీ మణిగ్రీవులు దనకింతలోఁ గనంబడుట దుర్లభమని తలంచుచు మనమున విరక్తి బూని యాదారినే నిజ నివాసమునకుఁ బోయెను.

మణిగ్రీవుండు శైలకందరాంతరమున నట్లు వివశుఁడై పడియుండి కొండొక వడి కొడలెరిగి తనభంగపాటున కడలుచు నా గుహనుండి బైటపడు నుపాయము దెలిసికొనఁ జాలక యదు తహతహంపడుచుండెను. అచ్చటినుండి వెనుకకుఁ దిరిగి పోవలెనన్నను నది సాధ్యముగాఁ గనంబడుటలేదు ఆ గుహాబిల మధ్యంబునఁ దనకుఁ జావుదప్పదని నిశ్చయించుకొని యెట్లయినను నవకాశ మున్నంతవరకు ముందునకు జరుగుటయే ధీరలక్షణమని తలంచి బోర్లతో నతికష్టముమీద రెండు బారలమేరఁ బ్రాకఁగలిగెను. అచ్చట‌ నాబిలము గొంచెము విశాలముగా నుండుటచే ముందేగుటకు వాని కించుక ప్రోత్సాహకరముగా నుండెను. మరికొంత దూరమట్లే ప్రాకుచుఁబ్రోవనా సొరంగము గ్రమక్రమముగా బెద్దదగుచుఁ గొంతవరకు వంగినడచుటకును బిదప నిలువఁబడి ముందేగుటకును ననుకూలమయ్యెను. ఆ బిలము ననుసరించి ముందేగుచుండ నెదుర వానికి వెలుఁగు గనంబడెను. దానింజూచి యా యక్షకుమారుండు ముదమందుచు