పుట:కాశీమజిలీకథలు-12.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


317 వ మజిలీ

శైలకందరము కథ

మణిగ్రీవజలంధరులు విమానముమీద ననంగమోహినిని బెట్టుకొని యక్ష లోకమునుండి తిన్నగా బుడమికేతెంచి హిమశై ల శిఖరమున నొక రమణీయప్రదేశమును జేరి అందు దివ్యయానము నిలిపి యప్పటికిని దెలివిదప్పియున్న యా యలినీల లామ నొక కందరాంతరమున కెత్తుకొనిపోయి యందు లలితాపల్లవములచే నమరింప బడిన శయ్యయందు బరుండబెట్టిరి. ఆమెకు స్మృతి వచ్చులోపల నాప్రాంతమందున్న స్వాదు ఫలముల గొన్ని దెచ్చి యుంచుట సమంజసమని తలంచి వారిరువురిలో నొక డట గాపుండుటకును రెండవవాడు ఫలాన్వేషనమునకుబోవుటకును నిశ్చయించుకొనిరి. మణిగ్రీవుడందుండెను. జలంధరుండు విమానమెక్కి యా * ప్రాంతముల యందు ఫలముల కై తిరుగుచుండెను ఇంతలో ననంగమోహినికి తెలివివచ్చి గుహాముఖమున నున్న మణిగ్రీవుని జూచి చకితురాలయ్యెను. కుచ్చిత కార్యాచరణపరాయణుండగు నాయక్షకుల కలంకుని బారినుండి తప్పించుకొనుట కుపాయమును జూపింపుమని పర మేశ్వరుని ప్రార్దించుచు మణిగ్రీవుడెరుంగకుండ మెల్లగా నా శయ్యనుండి లేచి తెంపున నా గుహలో గొంతదూరము లోనికి బోయి నిముసములో మాయమయ్యెను.

కొంతసేపటికి మణిగ్రీవుండా వేదండయానకు దెలివివచ్చినదేమో యని తిరిగిచూడ నా శయ్య యందామె వానికి గనంబడలేదు. అ౦దుల కులుకుచు నతండతి రయమున లేచి యచ్చటకేగి పరికించెను. అందామె యెందును జూపట్టకుండుటకు మనమున భయవిషాదవిస్మయములం బొందుచు నాగహ్వరాంతమునకు బారిపోయినదని నిశ్చయించి యామెను వెదుక లోనికిఁబోయెను. అంధకారబంధురంబై కరము భయా నకంబగు నగ్గుహాంతరమున వాని కేమియుం గనఁబడలేదు. అనంగమోహిని తప్పక యందెందో దాగియుండెనని నమ్ముచు నెట్లయిన నామెను బట్టుకొనవలె నను పట్టు దలతో నామెయందుగల మోహాతిరేకమున నొడలెరుంగక యతి సాహసమున ముందునకు తడవికొనుచు నడచుచుండెను. ఆ గుహ క్రమక్రమముగా సంకుచితమై నడచుటకు వీలులేకపోవుటయు నతండు గొంతదూరము ప్రాకుచు బోయెను. చివుర కందు గూర్చుండుటకుఁ గూడ తావులేకపోయెను. ఆ గుహాగర్భమున బోరగిలఁ బరుండి ముందేగఁజాలక చేతులతో నలుమూలలఁ దడవుచు ననంగమోహినీ యని పిలచుచు నామూలమున నీవును నీకొరకై నేనును నీదారుణ గహ్వరంబున నంతరించవలసినదేనా యని విలపించుచు యుత్కృష్ట యక్షవంశమునఁ బుట్టి యిట్టి యకార్యకరణమునకుఁ