పుట:కాశీమజిలీకథలు-12.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమసౌధము కథ

91

నబ్బిలముదాటి యడవులం బోయిన నపాయము లేకుండునని దలంచుచుండ దివో దాసున కదొక లిపి గనంబడుటయు దాని నతండిట్లు చదివెను.


ఉ. ఆపద సంభవించును జుమా ! యిఁక ముందడుగైనఁ బోయినన్‌
    ప్రాపుగ నిచ్చటే కల దుపాయ మొకండు బిలంబుదాట సం
    తాపము బొందనేమిటికి ? తధ్యము బోనిట హేమసౌధ ని
    క్షేపము రక్షణంబునకె కేవలమున్‌ సృజయింపగాఁ బడెన్‌.

అంత దివోదాసు డాలిపినందు రచించిన వారినిసంస్తుతించుచు బిలనిర్గమనో పాయమునకై యందు మరియు విమర్శింపుచుండ నొకదండ దివ్యగానరవంబొకింత వినంబడుటయు దాని కబ్బురంపడుచు నా ధ్వని యేతెంచిన వైవున నతిశ్రద్ధగా బరీక్షింప దొడంగెను. లిపి యందిచ్చటనే బిలముదాటుట కుపాయము గలదని యుండుటచే నది యున్నచోట వెదకుచు నొక్కొక్క యక్షరమును చేతితో దడుముచుండెను. “కలదుపాయ మొకండుబిలంబుదాట” అని యున్నచోటు చేతితో నదుమగా నా భాగములోనికి పోయెను. వెంటనే చేరువనున్న గుప్తద్వారము వివృతమయ్యెను.

దానింగాంచి వారిరువురును విస్మయమందుచు నందు సత్వరము ప్రవే శించిరి. తోడనే యా గుప్తద్వారము మూతబడెను దివోదాసుండు యక్షునితో నిపుడొక గదియందుండెను. శాంభవీ దేవతాలయము వెనుకనున్న యుపవనము వారికి దృగ్గో చరమయ్యెను. ఇదివరలో దాను బిలంబు బ్రవేశించిన గుప్తద్వారము వారిపుడున్నగది ప్రక్కగదిలో నున్నదని గ్రహించి యాశ్చర్యమందుచు నా మందిరము వెడలివచ్చిరి. ముందు దేవీగీతముల బాడు‌కొనుచు బుష్పావచయం బొనరించుచున్న దేవతాస్త్రీలు నేత్రపర్వ మొనర్చిరి. వారింగాంచి యా భూపాలుం డమందానందభరితాంతరంగుడై సత్వరము యక్షునితో వాని సన్నికర్షమున కేగెను. దివోదాసుండట్లు నిరపాయుడై తిరుగ దమ కన్నులంబడుటచే నాచకోరాక్షు లత్యంత సంతోష స్వాంతలైరి. గుప్త ద్వారమున బిలములో బ్రవేశించినది మొదలు జరిగిన వృత్తాంతమంతయు నా రాజేం ద్రుని వలన విని యద్భుతమందిరి. ఇంతలో దేవి నర్చించుటకు వేళయగుటయు నా మదగజయానలు సంభ్రమించుచు నమ్మవారి పూజావిధానములదీర్చి యిపుడే రాగలమని పలికి పూజాద్రవ్యములంగొని యతిత్వరితగమనముల నా యాలయమున కరిగిరి. దివోదాసుండును వారేతెంచువరకు నూఱకుండ నేల నని యక్షునితో నా ప్రాంతముల యందలి వింతలంజూడ బోయెను.