పుట:కాశీమజిలీకథలు-12.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మహారాజా ! భైరవీదేవి యాలయమునుండి శబర బాలకాన్వేషణంబునకుఁ బశ్చిమ దిశనున్న దివ్యభువనంబులెల్లఁ దిరిగి యెచ్చటను వాని యునికి నెరుంగఁజాలక గ్రమంబున వెనుకకువచ్చుచు నలకాపురము సమీపంబున మణిగ్రీవ జలంధరులఁ గలసి కొని వారివలన శబర బాలకుని వృత్తాంతము గొంత యెరింగి యావార్త మీకు నివేదింప వలయునను గుతూహలముతో మిమ్మ న్వేషించుచు తూర్పువైపుననున్న దివ్యపురంబు లన్నియు వెదకితిని గాని యెందును మిమ్ముగనుగొనలేకపోతిని. హిమవన్నగము మీద శబరబాలకుని బడవై చి వచ్చితిమని మణిగ్రీవ జలంధరులు నాతో జెప్పియుండుటచేత నచ్చటికేగి వానినైన గనుంగొని వచ్చుట యుచితమని తలంచి యొక దివ్యయానం బెక్కి భూలోకమున కేగితిని. అందు శీతశైల శిఖరమున నందందు విమర్శించుచు నొకదండ దేవతాలయముం జూచి విమానము నా ప్రాంతములకు బోనిచ్చి యా యాలయమునకు వెనుకనున్న పూలతోటలో దిగితిని. అందుగల మందిరమును జూచి దానియందేమైన వింతలు గనంబడవచ్చునని తలంచి లోన బ్రవేశించి గదులన్నియును విమర్శింపుచుండ నొక దానియందు గోడలో మీట యొకటి యమరించియుండుట గ్రహించి దానిని నొక్కితిని. తోడనే ప్రాంతమందున్న గుప్తద్వారము వివృత్తమై యందు క్రిందకు సోపానమార్గము గోచరించుటయు నదియేమో చూడవలెనను నుత్సా హముతో దానిలో బ్రవేశించి ముందేగితిని. బిలమార్గమంతయును మణిదీపికలచే స్పష్ట ముగా గనంబడుచుండెను. నేనిచ్చటి కేతెంచి నప్పుడిందుబోను లేదు. అది యెచ్చట నుండి వచ్చి నన్ను గబళించెనో యెరుంగగాని బిలమార్గమున నడచుచున్న నన్ను దృటిలో బడగొట్టి నొక్కివేసినది ఆపదలయందు గాపాడగలదని మీరు నాకిచ్చిన రత్నము మచ్చన్నిధి నుండుటచే నేనీ బోనులో నదమఁబడినను జీవించియుండుట తటస్థించెను. అందుజిక్కిన వెంటనే నేను వివశుండ నైతిని గాని తిరుగ నతిశీఘ్రముగనే నాకు స్మృతి వచ్చినది. ఆ యినుపనారసములు నా యొడలిలో గాటముగ నాటుకొని యున్నవి.

కాలుచేతులు గదలించుటకు గూడ శక్తిలేక పోయినది. నోటమాట వెల్వడ కుండెను. అప్రయత్నముగ మూల్గుమూత్రముబుట్టినది. నేనం దెట్టి బాధ ననుభవించి తినో నా కించుకయును దెలియదు. కొంతసేపటికి మూల్గుటకు కూడ నా కోపిక లేక పోయినది. పిదప నేమియును నెరుంగను. అ బోనున నమరింపఁ బడిన నారసములు మృత్యుదేవతాదంష్ట్రలన జెల్లును. అందుండి యెట్లీవలబడితినో యాబోనేమైనదో తెలియకున్నది. ఇట్టి భయంకరమైన యంత్రము నేనెచ్చటను గనివిని యెరుంగను. దీనిని బుచ్చుటకు భవదీయ బలప్రతాప ప్రభావములుగాక కారణమితరముగానేరదు. మీ దివ్యరత్నము నాకిప్పటికి రెండుగండముల దాటించినది. దీని యత్యద్భుత ప్రభా వము వర్ణింప బ్రహ్మాదులకైన దరము గాదని సంతోషాతిరేకమున బెక్కురీ‌తుల బ్రస్తుతింప‌ దొడంగెను. ఇట్లు వారిరువురును బరస్పర సమావేశమునకు ముదంబందుచు