పుట:కాశీమజిలీకథలు-12.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమసౌధము కథ

89

బటురయంబున నందుండి క్రిందకు నడచెను. ఆ సొరంగము మేడగోడలోనే యత్యద్భు తముగ నేర్పరింపఁ బడియున్నది. దాని వెంబడిఁ గ్రిందకుఁ దిగి ముందుఁ బరికింప మణిదీపికలచేఁ బ్రకాశించు బిలమార్గము జూపట్టెను. దానిం బ్రవేశించి కొలఁది దూర మరుగు వఱకే వెనుకఁ దాఁజూచిన యినుపబోను జేరఁగలిగెను. అందుఁ జిక్కుకొని యున్న దురదృష్టపు వ్యక్తి యట్లే యుండెను. కాని యిప్పుడు మూల్గుట మాత్రము మానివేసెను. ఆ వ్యక్తి యుత్తమాంగము దనవైపుగనే యుండెను గాని యది యధో ముఖమై యా నారసముల మధ్యనిమిడి యుండుటచేఁ బోల్చుటకు వాని కిప్పటికిని వీలు కలిగినది కాదు.

ఆ బోను నెడలించు సాధనము నెరుంగ గుతూహలముతో నా ప్రాంతముల విమర్శింప నందొక వంక నినుపగొలుసు వ్రేలాడు చుండెను. దానిని బట్టిలాగఁగా నా బోను తృటిలోమాయమయ్యెను. అందున్న పురుషుఁడు విస్మృతుఁడై దివోదాసుని పాదముల సన్నిధిఁబడియుండెను. ఆ పురుషుఁడు డెవ్వఁడోయని జూచుచుండ వానికిఁ జైతన్యము గలిగి యొక్కయుదుటునలేచి నిలువంబడి వానిం జూచి యారాజేంద్రుం డాశ్చర్య విషాదమేదుర హృదయారవిందుఁడయ్యెను. ఆ మందభాగ్యుఁడగు పురుషుఁ డెవ్వడు ? దివోదాసుని సహచరుండగు నరిందముఁడు. అతండు యక్షలోకమునుండి యీ గుప్తమార్గమున కేతెంచి బోనులోఁ దగుల్కొనుట రాజేంద్రునకు వింతగాఁ దోచెను. వాని కట్టికష్టముగలుగుటకు మిక్కిలి విచారించెను. ఎట్టకేలకు వాని కే యాపదయును లేకుండుటకు సంతసించెను.

ఆ యక్ష కుమారుండును దివోదాసుని జూచి యాశ్చర్యమందెను. వారిరువు రును గొండొక వడి నివ్వెరపాటు బొంది యొకరినొకరు బల్కరింప జాలక‌ చూపుల తోనే తమ హృదయానురాగముల వెలిబుచ్చుచుండిరి. అప్పుడు దివోదాసుండు నిజ హృదయోద్వేగంబడంచుకొని యరిందమునితో మందస్వరంబున నిట్లనియె.

మిత్రమా ! నేడు నేనెంతయును ధన్యుండను. ప్రాణస్నేహితుని యాపద దప్పించి వానితో ముచ్చటించు భాగ్యము నాకొదవెను. ఇందున్న బోనులో చిక్కు కొని యా బాధచే నీ వొనర్చిన యాక్రందన ధ్వనియే మనకు మహోపకార మొనరిం చెను. నేనీబిలము జొచ్చుటకదియే కారణమై యఖండైశ్వర్యము లభింపజేసెను. నీ యాపద దాటింపఁ గలుగుటకుఁగూడ నదియే మూలమగునుగదా. యక్షలోకంబు నుండి యిచ్చటి కెట్లువచ్చితివి ? ఈ బోనులో నెప్పగిదిఁ జిక్కుకొంటివి ? నీ యుదం తము సాంతముగా వినఁ గుతూహల మగుచున్నదని యడుగుచున్న యమ్మహారాజున కరిందముండు పునఃపునస్సాష్టాంగ దండప్రణామంబు లాచరించుచు వినయముతో నిట్టనియె.