పుట:కాశీమజిలీకథలు-12.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    న్యాయంబైన ప్రభుండు గాఁగలఁ డిఁకన్‌ యక్షప్రవీరుండు నా
    త్మీయస్వామ్యము దీయందు విడచున్‌ మేలెంచిముమ్మాటికిన్‌.

క. పాయక బిలమధ్యంబున
   వాయసమై యెసఁగు బోను నద్భుతరీతిన్‌
   దీయఁగఁ దగు సాధనమును
   నీయైదవ యంతరువుననే తెలియఁదగున్.

ఉ. ఇక్కడనే సొరంగమునకేగఁగ దగ్గరదారి యుండె నిం
    కెక్కడనుండి బోనుదరికేగిన దానిని బుచ్చుసాధనం
    బొక్కటియున్‌ లభింపదు మహో త్తమ పూరుషుఁడెవ్వఁడేని యీ
    చక్కనిఁగీలెఱింగిన భృశంబు శుభంబు లతండు బొందెడిన్‌.

మ. బిలమార్గంబున వచ్చియున్న యతఁడే బ్రీతిన్‌ విలోకింపఁగాఁ
     గలఁధీసౌధము నన్నుఁడెవ్వనికి నెక్కాలంబునన్‌ గాని యీ
     విలసన్మందిరభాగ మేమియును బృద్వి న్గానఁగారాదు క
     న్నుల కీదేశము సాంద్ర కాననగతి న్జూపట్టు నెప్పట్టునన్‌.

అనియున్న లిపిని బలుమారు చదువుకొని యంతరంగమున నుప్పొంగుచు నాధాత్రీ బిడౌజుండు బిలమార్గంబునఁ గల యినుపబోనును దర్శించు సాధనము నెరుంగుటకై యందు విమర్శింపఁ దొడంగెను. కాని వాని కేమియును‌ గనంబడలేదు. బిలమును చేరుట కందుండికలదన్న చేరువదారి నైనఁ గాంచవచ్చునేమో యని దాని కొఱకు వెదకెను.

అందింకొక గదియందు సుందరమగు బల్లయొకటి యమరింపఁ బడి యున్నది. దానిమీద విల్లును, నంబుల పొదియును గలవు ఆ గది యందే యొకమూల గోడనంటి కృతిమ పతత్రి గోచరించుచుండెను. ఆగోడమీఁద నిట్లు వ్రాయఁబడి యున్నది.


చ. ఇటఁగల వింట నారి నమరించి యుదంచ దిషుప్రయోగ సం
    ఘటనముచేతఁ గట్టెదుటఁ గన్పడు గృత్రిమ పక్షిశీర్షమున్‌
    దటుకునఁ ద్రెళ్ళనేసినఁ గనంబడు బెన్వివరంబు బోనుఁ జే
    రుట కదెమార్గ మచ్చట నెరుంగఁగవచ్చును మీదికృత్యమున్‌.

అనియున్న లిపిఁ బఠించి యందుబల్ల పైఁ గల కోదండంబుగ్రహించి గుణంబు సారించి మార్గణంబు దొడిగి యా మాయావిహాయసంబు శిరంబు గురిఁ జూచి యేసెను. తోడనే యా యంత్రవికిరంబు తలదెగి క్రిందపడెను. సమీపమున నున్న గోడబారెడు వెడల్పునఁ గ్రిందకుజారుట గమకించి యందేగి చూడ విశాలమగు సొరంగము జూపట్టెను. దిగుటకు సోపానము లేర్పడి యుండుటచే యా రాజోత్తముండు