పుట:కాశీమజిలీకథలు-12.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యును దలుపులు దెరువబడియే యున్నవి. అందు దొమ్మిది గదులయందు దివ్య మాణిక్యములు రాసులుగా నుండెను. పదియవ గదిలో మీదియంతస్తునకు బోవుటకు సోపానము లమర్పబడియున్నవి. దివోదాసుడా మెట్ల వెంబడిని పైభాగమునకు బోయెను. అందుగూడ బదిగదులే గలవు. తొమ్మిది గదులనిండ నవర్ఘరత్నములుండి తక్కినదానలో మెట్లుండెను. ఆ రత్నరాసులంజూచి యా రాజమార్తాండుడు నివ్వెరం బడుచు మూడవ యంతస్తునకేగెను. అందు ముందు మిగుల విశాలమగు ముంగిలి యును దాని కిరుప్రక్కల రెండేసి గదులును గలవు. ఆ ముంగిలియంతకును జిత్ర చిత్రవర్ణములుగల రత్నకంబళ మొకటి పరవబడి యున్నది. గదులయం దాణిముత్తె ముల ప్రోవులుండెను. ఆ సౌధంబున కింకను రెండంతస్తులు గలవు గాని యందు బోవు టకు సోపానములు గోచరించుటలేదు. వానియందుగల వింతలగూడ జూడవలయునసు నుత్సాహముతో నా రాజేంద్రుడందు బోవుటకు వెరవాలోచించుచుండెను. నలుమూలలు బరికించి యందొక వైపున గోడలో నమరింపబడియున్న తలుపును గనిపెట్టగలిగెను. దానికీవల జిన్నబీగము‌ వేయబడియున్నది. అది బిగించటయు నూడదీయుటయును గూడ నక్షరసాంకేతికమునుబట్టి యేర్పడియుండుటచేత దాని దీయు విధము నెరుంగ నతండించుక యోజింపవలసివచ్చెను ఆ బీగమునం దక్షరములతో నున్న చక్రములు నాలు గమరింపబడియుండి‌ చేతితో ద్రిప్పిన నటునిటు దిరుగాడుచుండెను. ఆ యక్షర ములతో నెద్దియో యొక సాంకేతికపదమును గూర్చినగాని యా తాళమూడిరాదని యతడు గ్రహించి యట్టిపద మెద్దియగునో యని యూహించుకొనుచు నా యక్షర ముల బరిశీలింపుచుండెను. వానిలో “దృష్ట" అను ద్విత్వాక్షరములు వరుసగదులం దుండుట జూచి దైవికముగా వానికి, “అదృష్టము” అను పదము స్ఫురించెను. అట్లు నాలుగరల యక్షరములను గూర్చి బీగమును లాగగా నది యూడివచ్చెను. బీగ మూడుట కేర్పరచిన సాంకేతికపదము దన కప్పుడు స్ఫురించినందులకు డెందమున నానందమందుచు నా రాజచంద్రుడు కవాటమును దెరచి చూచెను.

అందు సోపాన మార్గము గోచరించెను. వెంటనే పై యంతస్తున కతఁడవ లీల బోగలిగెను. ఆ నాల్గవ యంతరువున జూడ దగినవింత లేమియును గనంబడ లేదు. పైభాగమునకు బోవుటకు సోపానములును లేవు. కాని యొక గోడమూల బిగించి యున్నత పీఠమున శక్తివిగ్రహమొకటి ప్రతిష్టింపబడియున్నది. ఆ విగ్రహ మట్లు మూలనుండుటకు శంకించుచు దాని సన్నిధికేగి విమర్శించి యదియు నొక యంత్ర విశేషమేయని గ్రహించెను. దాని కీలెరుంగుట కతడెంత బ్రయత్నించినను వ్యర్ధమయ్యెను. ఆ విగ్రహమున కెదురుగా నిర్విణ్ణడై యతఁడు జదికిలంబడి ఱెప్ప వేయకుండ దానిని జూచుచుండెను. ఆ యమ్మవారి కంఠభాగమున నెద్దియో గీలమరి యున్నట్లు తోచుటంజేసి యాతండు త్వరితగతి లేచి తత్కంఠమును రెండు చేతు లతో నొక్కి పెట్టెను. తోడనే యా విగ్రహము నోరు వివృతమై సొరంగమేర్పడెను.