పుట:కాశీమజిలీకథలు-12.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మారుఁమ్రోగుచుండెను అందుఁ జిక్కుకొనియున్న యాదై వోపహతుం డెవ్వఁడో తెలిసికొనుటకు వాని యుత్తమాంగ మా యంత్రమున నావలవై పుగా నదుమఁ బడి యుండుటచే వీలుగలిగినదికాదు. ఆ యిపనారసము లన్నియును వాని దేహమున నట్లు తీవ్రముగ నాటుకొనియున్నను నొక రక్తబిందువైనను గ్రిందఁ బడుటలేదు. అందు బడిన నే జీవియైనను నిమిషములో బ్రాణములఁ బాయవలసినదేగాని యా వ్యక్తి కేమి కారణముననో చైతన్యము దప్పలేదు.

దివోదాసుండు వాని నా యంత్రమునుండి తప్పింపవలయునని యెంత ప్రయత్నించినను సాధ్యపడలేదు. చేతులతో బలముగా నా నారసములఁ బైకెత్తఁ జూచెను. అడుగుననున్న వానిని క్రిందకుఁ ద్రోయ నుంకించెను. పాదములతోఁ దన్ని పట్టి గట్టిగా యీవలకు లాగఁదొడంగెను. ఇట్లెన్ని యుపాయములఁ బ్రయోగించినను నన్నియును వ్యర్థమయ్యెను. ఆ నారసము లించుకయును జలింపలేదు. ఏమిచేయుటకుఁ దోచక యా రాజేంద్రుం డచ్చట చతికిలంబడి యొకింత తడవేమి చేయుటకుఁ దోచ కుండెను.

పిమ్మట నెద్దియో స్మరణకు వచ్చినట్లు తటాలున లేచి యా ప్రాంతముల నతిశ్రద్దగా వెదుకసాగెను‌. ఆ యంత్రము మార్గమంతయును నాక్రమించియుండుటచే దానిని దాటుట కుపాయము దోచుటలేదు నారసముల సందులనుండి మణిదీపికల వలన నా బిల మింకను జాలాదూరము వ్యాపించియున్నట్లు స్పష్టపడుచుండుటచే నెట్లయి నను నా యడ్డమును దాటి ముందుండు వింతలఁ జూడవలయునని వాని కుత్సాహ మధికమగుచుండెను. అంతకుముందు దాటివచ్చిస ద్వారము వలెనే యీ యంత్రమును గూడ నెద్దియైన మీటచే నమరింపఁబడి యున్నదేమో యని యా భూపాలుండు మిగుల నోపికతో నందందు విమర్శింపఁ దొడంగెను. ఆ బిలము చుట్టునుగల కుడ్యము లతి స్నిగ్దములై యుండుటచేఁ జేతులతో నెంత తడవిచూచినను, నెచ్చట నొక్కినను వాని కట్టిసాధనమేమియును దొరకలేదు చివరకందు దీపమువలె వెలుఁగుచున్న రత్నముల నొకటొకటిగఁ గదలింపసాగెను. అందొక రత్నమించుక చలించినట్లు తోచి దానిని గట్టిగ నొక్కెను. తోడనే యా యంత్ర సమీపమునఁ జిన్నతలుపు తెరచుకొనుటచే మార్గమేర్పడెను.

దాని కతండచ్చెరువందుచు నా ద్వారమువెంట రెండవప్రక్కకుఁబోయి యా యంత్రమున నున్న వ్యక్తిని దప్పించవచ్చునేమో చూచెదంగాక యని యందుఁ బ్రవే శించెను‌ తోడనే యా గుప్తమార్గము మూతపడెను. ముందుఁ బోయిచూడ వానికా యంత్రముగాని యందున్న వ్యక్తిగాని కనుపించలేదు. బిలమార్గము దిన్నఁగా మణి ప్రదీపులచే విస్పష్టముగఁ దెలియఁబడుచుండెను. ఆ మార్గమున నతివేగముగా నడచు చుండఁ జివురకొక విశాల రమణీయ ప్రదేశంబునకు జేరుకొనెను. పిదప నతండు