పుట:కాశీమజిలీకథలు-12.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిగ్రీవజలంధరుల కథ

83

యపుడు గాలఁదన్నుకొనిపోయిన భాగ్యలక్ష్మి నేఁడు గ్రమ్మర మనవశమైనది. ఇపు డైనను మనము దీనిని జాగ్రత్తగాఁ గాపాడుకొనవలయును. అని వచించుచు నుద్యాన మందిరమున జరిగిన వృత్తాంతమంతయును వాని కెఱింగించి యీమెకుఁ దెలివిగలుగు లోపల నొకవివిక్త ప్రదేశంబునకుఁ జేర్పఁదగును గావున నతిశీఘ్రముగ విమానమును గొనిరమ్మని వానినంపెను. జలంధరుండును విస్మయస౦తోషాశ్చర్యములతో సత్వరమె యొక దివ్యయానమును విమానశాలనుండి కొనితెచ్చి మణిగ్రీవునను సంతోషమును గలుగఁజేసెను.

పిమ్మట నొడలెరుంగక పడియున్న యాసన్నుతాంగిని విమానము పైఁ బెట్టుకొని వారిరువురును భూలోకమునకుఁ బోయి యందు జనసంచారానర్హంబగు శీత నగాగ్రమున నొక సుందరకందరాంతరమునఁ బ్రవేశించిరి. యక్షలోకమున గుణవతి కిని నామె చెలికత్తెలకును మణిగ్రీవుం డరిగిన కొంతసేపటికి తెలివి వచ్చినది. అనంగ మోహినిని దన సోదరుండు బలాత్కారముగాఁ గొనిపోవుటకు గుణవతి మిగుల విచా రించెను. ఈ యుదంతము నితరులతోఁ జెప్పినఁ దనగుట్టు బట్టబయలగునేమోయను భీతిచేత దొంగఁ దేల్గుట్టిన చందమున నెవరికిని దెలియనీయక నిజనివాసమునకేగి లోలోన గుందుచుండెను.

316 వ మజిలీ

య౦త్రబిలముకథ

దివోదాసుండు గుప్తసోపాన మార్గమునంబడి కొంత దూరమరుగునప్పటి కంతకుముందందుగల చీఁకటి క్రమక్రమముగా నంతరించుచు నత్యద్భుతమగు తేజో రాశి గోచరమయ్యెను. ఆ యనఘుఁడు దానున్న దొక విశాల బిలాణ్విమని గ్రహించి దాని యంతమెఱింగి యందలి వింతలఁ దెలిసికొనఁ దలంపు మిగుల నతిసాహసమున ముందునకుఁ బోవుచుండెను. ఆ బిలమున కిరుప్రక్కల నచ్చట నుండియే యనర్ఘ రత్నములు స్థాపింపబడియుండుటచేఁ బట్టపగలువలె నా ప్రదేశమంతయును దేదీప్య మానముగ వెలుఁగుచుండెను. అట్లతడు కొంతదూర మరుగునప్పటికి ముందబ్బిల మార్గమున కడ్డముగానున్న యినుపబోనును బోలు యంత్రమునం దొకవ్యక్తి చిక్కు కొని కష్టపడుచుండుట కనంబడెను. ఆ దృశ్యమున కతండద్భుతమందుచు నతిజ వంబున నా యంత్రమును సమీపించెను. కోరలవలె నినుప నారసము లనేకముగాఁ బైనుండియుఁ గ్రిందనుండియు నా వ్యక్తిని గట్తిగా నొక్కి వేసెను. వాని సందునంబడి యావ్యక్తి కొట్టుకొనుచు బాధచే బిట్టమూల్గుచుండెను. అ ధ్వని యా బిలమంతయును