పుట:కాశీమజిలీకథలు-12.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మృగము వాతనోబడి మృతినొందియుండును. ఓపిక గలదేని వానికొరకు మీరు యమ లోకమునకు బోయిన నందు వాడు గనంబడగలడు.

మణి -- ఈ సంగతి నీ యజమానునితో మనవిజేసి సత్వరమ వానిని నర లోకమునకు దోడ్కొని పొమ్ము అని పరిహాసమాడెను.

ఆ మాటల నమ్మి యరిందముండు ముందేగుట మాని యా వృత్తాంతము దివోదాసునితో జెప్పవలయునని వెనుకకు మరలెను. మణిగ్రీవజలంధరులును వానితో నడచుచుండిరి. వారు మువ్వురు నిట్లు కొంతదూర మరుదెంచువరకు వారికి ముందు గుణవతి లిలోద్యానము గోచరమయ్యెను. అందు గుణవతి యనంగమోహినితో గాత్యా యనీవ్రత మొనరించుచుండెను. నాడు దివోదాసుడు దమ సన్నిధినుండి యెచ్చటకో పోయి తిరిగి రాకుండుటకు భయమందుచు శీఘ్రమ యాతని నిరపాయునిగా దమ సన్నిధిం జేర్చుటకు గాత్యాయనిం బ్రార్దించుచు నా వ్రతమును జేయుచుండిరి నాడు వ్రతసమాప్త మొనరించి యోషిజ్జనమునకు బసుపును, గుంకుమను బంచిపెట్టుచుండిరి.

ఆ సందడి నాలకించి మణిగ్రీవుండు జలంధరుని నిష్కుటద్వారమున నిలిపి తాను లోనికి బోయెను. అరిందముని మనంబు దివోదాసునియందె లగ్నమై యుండుటచే నతఁడందు నిలువక యెచ్చటికో పోయెను. మణిగ్రీవుడు దిన్నగా గుణ వతి మందిరమున కరిగెను. అందు గుణవతియు ననంగమోహినియు వేలుపుబేరం టాండ్రను బూజించుచు వారికి గనంబడరి. అనంగమోహినిని జూచుటతోడనే యతండు విభ్రాంతుడయ్యెను. కొంతసేపటివరకు నందలివారెవ్వరును వీని రాక గమ నించి యుండలేదు. పిమ్మట యనంగమోహిని వానింజూచి భయవివశయై యొక్క పరుగున నభ్యంతరమంధిరమునకు బారిపోయి యందు దలుపు బిగించుకొని యుండెను. మణిగ్రీవుని రాక యచ్చటనున్న మచ్చకంటు లెల్ల దెలిసికొని చెట్టొక పిట్టలై యందుండి వెడలిపోయిరి. గుణవతి యిరు‌వురు చెలికత్తెలతో నందు మీగిలియున్నది. ఆమె సోదరున కెదురువోయి తోడ్కొనివచ్చి యుచితాసనమున గూర్చుండబెట్టి మిగుల నక్కటికముతో నిట్లనియె.

సోదరా! ఆడువాండ్రు విహరించు నీకేళికోద్యానమునకు నేడిట్లేల వచ్చితివి? నిన్నుజూచి యందలి స్త్రీ జనంబెల్ల యెట్లు పలాయనులైరో చుచితివా? నీ రాకవలన మా యుత్సవమునకు గూడిరాని యంతరాయము గలిగినది. ఈ యుదంతము బెద్ద లెరింగిన నీపై గినియకుందురా ?

మణి -- సోదరీమణీ ! నేను నీతో గొంత యత్యవసరముగా ముచ్చటింప వలసి యుండుటచే నసమయమైనను నేడిందు రావలసి వచ్చినది. ఇందులకు నాపై గినియకుందువుగాక.

గుణ - [ఆతురతతో ] నేడు విశేషము లేమి గలిగినవి ? నీ యాగమన కారణము సత్వరమ జెప్పుము.