పుట:కాశీమజిలీకథలు-12.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిగ్రీవజలంధరుల కథ

81

మణి - నేను వచ్చిన పని పిమ్మట జెప్పెదనుగాని ముందుగ నేనడుగు మాటకు సదుత్తరము నీవొసంగవలయును. నే నిందేతెంచువరకు నీ సన్నిధి నున్న పొన్నికొమ్మ యెవ్వతె? నన్ను జూచిన తోడనే యా చేడియ లోనికిబారిపోయె నేమిటికి? ఆ ముద్దులగుమ్మకు నీ సన్ని కర్షమున నంత స్వతంత్రమెట్లు గలిగెను ?

గుణ -- పరనారీమణుల ప్రసంగముతో నీ కించుకయు నిమిత్తములేదు. ఆ యన్నులమిన్న నాకు మిగుల నాంతరంగికురాలు. కొన్నిదినములనుండి నాతో గలసి మెలసి యున్నది. పరపురుషుని గాంచినతోడనే తొలంగిపోవుట శీలవతీ లక్షణమని యెరుంగవా ?

మణి -- ఆమె యాకార లక్షణముల బరికింప సురవనిత కాదని తోచు చున్నది. దివ్యకామినుల దిరస్కరించు సోయగముగల లలనామణి యిందుండుటకు వెరగందుచు నామె వృత్తాంత మెరుంగగోరితి నిందు తప్పేమియున్నది.

గుణ -- ఆమె యెట్టిదైనను నీకు తోడబుట్టువువంటిది కావున నామె విషయమై నా సన్నిధానమున నేమియును బ్రస్తావింపకుందువుగా.

మణి -- ఈమెను నేనిదివర కెచ్చటనో చూచినట్లుండెను. ఈ యోషా రత్నము మనుష్యలోకమునుండియే యిచ్చటకు వచ్చెను గదా?

గుణ --ఆమె విషయమగు ప్రసంగము గట్టిపెట్టుమన్న మానకుంటివేమి? ఈమె భూలోక చక్రవర్తియగు దివోదాస రాజమార్తాండుని యర్దాంగలక్ష్మి. కారణాంతరమున నిప్పుడు నా యంతఃపురమున నివసించియుండెను.

మణి -- ఏమీ ? ఈమెను నేనెరుగననుకొంటివా ? మనుష్యలోకమునుండి యీ దివ్యలోకమున కీ నారీమణి దెచ్చినవాడను నేను గాదా ? నా కామెతో బూర్వ పరిచయము లేదనుకొనుచుంటివి కాబోలును. నాతో నిట్లు మర్మముగా మాటలాడుట దగునా ? లోనికేగి యా యెలనాగతో నేనించుక ముచ్చటించుట కనుమతింపుము.

గుణ - మూర్ఖుడా ! అధిక ప్రసంగము జేయకుము. ఆ యంగనా మణి రూపమున కాసించి యిట్లసంబద్ధము లాడుచున్న నిన్నేమి చేయించెదనో చూడుము. పొమ్ము. ఆమె నీడ నైన స్పృశించుటకు నీకర్హతలేదని గ్రహింపుము.

మణి -- ఆమె నీడనే గాదు తద్గాత్రమునే యింతకుముందు స్పృశించియుంటి నని యెరింగిన నిట్లు వచించియుండవుగదా ? ఆమె నన్నే మనోహరునిగా నిరూపించు కొనిన మాట వినినచో నిట్లు కఠినముగా బల్క నేరవుగదా ?

గుణ - ఛీ! ఛీ!! నోరు మూసికొనుము. అచ్చమగు యక్షకులమున కంతకును మచ్చదెచ్చుచున్న నీ నీచ ప్రవర్తనమున కింకనైన బుద్ధి దెచ్చుకొనుము. ఒక్క మహాసాధ్వినిట్లు కారులుచర్చించు నీ నాలుకను వేయి చీలికలుగా గోయించినను దోసము లేదు.