పుట:కాశీమజిలీకథలు-12.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిగ్రీవజలంధరుల కథ

79

జలం -- ఆ మహారాజు నీమె వరించుట యెట్లు గలిగెను ఆతఁడు మనుషుఁడును నీమె యక్షకన్యకయునుగదా! లోకాంతరమందున్న వాని నీమె యెట్లె ఱింగెను.

అరిం - ఆ మహారాజిప్పు డీ లోకమునందే యుండెను. శబరబాలకాన్వేష ణంబు నెపమున నతండిందు యోగమార్గమున విచ్చేసెను. అని యాకథ నంతయును సంక్షేపముగఁ గొంతకొంత వారికి జెప్పెను.

మణి --- ఉత్కష్టమగు యక్షవంశమందు బుట్టిన గుణవతి మనుష్య మాత్రున కిచ్చుటకు నే నంగీకరింపఁజాలను. ఆ మానవనాధు నిందుండి యేటో మాయో పాయమున నావలకు సాగనంపు వఱకు నామనమున నూఱట గలుగనేరదు. మిత్రమా! జలంధరా! ఇందులకు నీ వేమందువు.

జలం - ఇందులకు నాకు పరమసమ్మతము. యక్షకన్యక మనుష్యమాత్రున కిల్లాలగుట మనలోకమున కంతకును దలవంపులుగా నుండును.

మణి - [అరిందమునితో] మిత్రమా! నీవిప్పుడు దివోదాసుని పనిమీదఁ బోవుచుంటివిగదా? ఇట్లు జేయుట నీకుఁ దగనిపని యని యెందులకుఁ దోచలేదు నీవా నరనాయకుని సేవకుఁడవా యేమి? నీవు పూనిన కార్యమునుండి విరమించి ముందు మా యుద్యమమునకు సహాయ మొనర్పుము.

అరిం - అయ్యో! మీ యవివేకమునకు మేర లేకున్నది భైరవీదేవి స్వయముగా నన్నా ధాత్రీకళత్రున కప్పగించినది. అమ్మహారాజు బలపరాక్రమ ప్రభావముల దివ్యులఁ దలదన్ను వాఁడని యా యమ్మవారే సెలవిచ్చియుండెను. అట్టి వానితో శత్రుత్వము వినాశ హేతువగును గదా ? మీ యూహలు నా కించుకయును రచింపవు. మీ యవివేకమునకుఁ బిమ్మట మీరే పశ్చాత్తప్తు లగుదురు. మీతో నే నేకీభ వింపఁ జాలను. మీ దారిని మీరింక పొండు. శబరబాలకుని వెదకుట యందు నేను మసలరాదు.

మణి - ఇప్పుడా రాజెక్కడ నుండెను ?

అరిం - శబరబాలకు నన్వేషించుట కా యనఘుండు తూర్పు దిక్కునకు స్వయముగాఁ బోయి నన్నీ పడమటివైపున వానిజాడ లెరుంగఁ బంపెను.

జలం - శబరబాలకుఁ డీలోకమునుండి వెడలిపోయిన యుదంత మెరుం గరు కాఁబోలును. మీ ప్రయత్న మంతయు నిందు వ్యర్థమే యగును.

అరిం --- వాని వృత్తాంతము నీ కెట్లు తెలిసెను.

జలం - నాలుగు దినముల క్రిందట బ్రాతఃకాలమున భైరవీదేవి యాలయ మునకు గ్రోశుదూరమున బేటికావలంబకుం డగు మనుజబాలకుండు మా కంటబడెను. ఆ పెట్టి లోపలను వాని శరీరమందును నెద్దియో తైలముండుట జూచి మేము వానిని చోరునిగా సంశయించి యా పెట్టియందు వానిని‌ బంధించి భూలోకమున హిమ శైలముమీద బడవైచి వచ్చితిమి. వాడీసరి కాపేటికాంతరము నందో లేక యే యడవి