పుట:కాశీమజిలీకథలు-12.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మణి --- మిత్రమా ! ఈ మధ్య నీవు బొత్తిగా మాకుఁ గనిపించుట మాని వేసితివేమి? నీవెద్దియో వ్రతదీక్షయందున్నావని వింటిని. అయ్యది పూ ర్తియయ్యెనా ?

అరి౦ద - మణిగ్రీవా ! నావ్రత మంతయును గొలఁది దినముల క్రిందనే పూర్తియైనది కాని యా వ్రతఫలము మాత్రము శూన్యమయినది.

జలం --- అదెట్లు? గుణవతిని బరిణయ మగుటయే యా వ్రత ఫలంబని దెలిసినది. నీ కామె నిచ్చుటకుఁ జిత్రకేతున కభ్యంతర మేమియును లేదుగదా?

మణి --- ఈ సంబంధమునకు మా తల్లిదండ్రులు లిదివరకే యిష్టపడిరి.

జల -- ఇఁక గావలసిన దేమున్నది. భైరవీదేవి వీనియందుఁ బ్రసన్నత వహించియున్న దనవచ్చునుగదా చేసిన పూజా వ్యర్ద‌ మెన్నటికిని గానేరదు.

అరిం - ఎవరి కిష్టమున్న నే మాయెను, గుణవతికి నాయందిసుమంతైనను గోరిక లేదు.

మణి -- తల్లిదండ్రుల యనుమతంబు నెన్నఁడును నా సహోదరి యతిక్రమింపదు.

అరిం - అట్లయిన నీ పంచమీ శుక్రవారమునాఁడు స్వయంవరముఁ బ్రకటించుట యెట్లు జరిగెను.

మణి - అయ్యది లోకవిడంబనార్థమని గ్రహింపవలెను.

అరిం - నీ వేమి చెప్పినను గుణవతి నన్ను వరింపదను సంగతి మాత్రము నాకుఁ బూర్తిగఁ దెలియదు. అట్టి యిష్టములేని వనితం బెండ్లియాడఁ దలంచుట మిగుల నవివేకమని నే నిప్పుడు నిక్కముగఁ దలంచుచున్నాను.

జలం - [నవ్వుచు] మా మిత్రున కింతలో నింత మనఃపరివర్తనము గలు గుట మిగుల నబ్బురముగానే యున్నది.

మణి -- [అరిందమునితో] నీ మాటలు విన నామెయందు నీకు విరక్తి గలిగినట్లు దోచుచున్నది గదా ? ఇంతకు మించిన సుందరాంగి నీకు లభింపఁగలదా! ఊరక మనస్సంకులముం బొందక స్వయంవరమున కేతెమ్ము. నిన్నే యామె మా తల్లిదండ్రుల యాదేశము వడువున వరింపఁగలదు.

అరిం --- ఆమె హృదయమున నింతకు వేఱొక పురుషపుంగవుని వరించియే యున్నది. అయ్యది నాకు పరమసమ్మతము. కావున నే నామెను గలనైన నిఁక దలంపఁబోనని యెరుంగుము.

మణి - ఆమె వరించియున్న పురుషుఁ డెవ్వరు ?

అరిం - దివ్యబల ప్రభావ ప్రతాప తేజోవిరాజితుండగు దివోదాస ధారుణీ చక్రవర్తియే యామె మనోహరుండని నమ్ముము.

మణి, జలం - [ఆశ్చర్యమును సూచింతురు.]