పుట:కాశీమజిలీకథలు-12.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవతాస్త్రీల కథ

77

ఆ గదినంతయును దివోదాసుండతి శ్రద్ధతో విమర్శింప నొకవైపునఁ గ్రిందిభాగమునఁ జిన్నతలుపు గోచరమయ్యెను. దానిని తెరచుటకు వానికి సాధనము గనిపింపలేదు. బుద్ధిమంతుండగు నతండది యొక గుప్తద్వారమని గ్రహించి దాని కీ లెచ్చటనుండునో యెరుంగ నందందుఁ బరీక్షింప నాగదిగోడమూలఁ జిన్నమీట యొకటి దృగ్గోచర మయ్యెను. దానిని చేతితో నదుముటయు నా గుప్తద్వారము వివృతమగుటయు నొక్క సారి జరిగెను. అదిచూచి దేవకాంతలు భయాశ్చర్యస్వాంతలైరి దివోదాసమహారాజు మహాసాహసముతో నందున్న సోపానమార్గమునఁ గ్రిందకు దిగెను. తోడనే యా తలుపు మూసుకొనిపోయెను. అది మొదట నెప్పగిదిఁ దెరువఁబడినదో దేవకాంతలు గ్రహించియుండలేదు. కావున దానిని దిరుగఁదెరచుటకు వారనేకసాధనము లుపయో గించి చూచిరిగాని యేమియును గార్యము లేకపోయినది. పెక్కుసంవత్సరములనుండి వారందుఁ దిరుగుచున్నను నమ్మందిరమున నిట్టి గుప్తద్వారమున్నదని యెరుంగరు. శాంభవీదేవి యాలయనిర్మాణ సమయముననే యమ్మందిరముగూడఁ గట్టబడినది. ఆ గుప్తమార్గము నెద్దియో యుద్దేశ్యముతోనే మొదట యక్షపుంగవుం డేర్పరపించి యుండవచ్చును. ఆ దేవకాంతలు రాజేంద్రుని రాకకై యాద్వారముచెంత నెంత వేచి యుండినను వానిజాడ తెలిసినది కాదు. పిమ్మట వారు దేవీపూజకై యాలయమున కరిగిరి.


315 వ మజిలీ

మణిగ్రీవ జలంధరుల కథ

యక్షపురమున మణిగ్రీవ జలంధరులకుఁ గుబేరుని మూలమున మైత్రి కుదిరినది. వాని వైరభావం బంతయునుబోయి క్రమక్రమముగాఁ దొంటి యాంతరంగిక స్నేహ మలవడ‌ నెప్పటియట్లు మెలంగఁదొడంగిరి. చేతి కబ్బిన యనంగమోహినిని యవివేకులమై యనుభవింపజాలకపోతిమని మాటి మాటికిని బశ్చాత్తాప మందు చుండిరి. హేమావతి తమ్మాడిన నిష్టురములకు దానియం దీర్ష్యవహించి తిరుగ నెన్నఁ డును దానింటికి వారరిగియుండలేదు ఆ యచ్చరకును నామిత్రద్వయమునందు విర క్తి బుట్టి వారి నెన్నడును దలంచియుండలేదు దానంజేసి వారికి స్వర్గలోక ప్రయాణావ సరముదరుచు కలుగదయ్యెను.

ఒకనాఁడా మిత్రు లిర్వురును వాడుక ప్రకారము విహారార్థమై కొండొకదూర మరిగి వచ్చుచుండగా నరిందముండు వారికి దారిలోఁ దారసిల్లెను. వారికిట్లు సంవాదము జరిగెను.