పుట:కాశీమజిలీకథలు-12.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మేము నల్వురము నొక్కనికే యిల్లాండ్రముగా యుండుటకు నియమము సేసి కొంటిమి. కావున మమ్మెల్లరను భార్యలగా స్వీకరించి కుబేరునితో బ్రతియనదగు రీతి నిందలి భాగ్యంబెల్ల ననుభవింపుమని పలికి యూరకుండెను.

అప్పలుకులు కప్పుడమియొడయండు మహాశ్చర్యానందకందళిత హృద యారవిందుడై యావేదండయానల నల్వురును బరిణయంబగుట కంగీకరించెను. కాని శబరబాలకుని వాని యాప్తుల సన్నిధిం జేర్చువరకును దాను బెండ్లి యాడకుండుటకు నియమము జేసికొని యుంటిననియు బిదప గనిష్టభార్యలుగ వారిని స్వీకరింతునని యును వారి మనంబులు నొవ్వకుండ దగినరీతిని సమాధానము జెప్పెను. అందు లకు దేవకాంతలుగూడ సంతోషముతో నంగీకరించిరి. అప్పుడు మదనమంజరి దివో దాసు తో వెండియు నిట్లనియె.

ప్రాణేశ్వరా ! పిశాచరూపంబుల నరణ్యమధ్యమందు మేముచేసిన సంగీత ధ్వని నొరులు వినకున్న మాకు శాపావసానము గలిగియుండనేరదు గదా ! మనుష్య సంచార శూన్యంబగు నిబ్బయంకరారణ్యంబునకు మా యిక్కట్టు దొలగింప నేమహాత్ముఁ డేతెంచెనో గ్రహింపఁ జాలకున్నాము. ఆ ప్రాంతములయం దెన్నఁడును మాకెవ్వరును గనిపించియండలేదని దృఢముగా జెప్పగలము. కాని యింతకుముందు మేమీ యమ్మవారి యర్చన కేతెంచునప్పు డిందున్న యుపవనమున నొక మనుష్య బాలకునిఁ బేటికాహస్తుని మాత్రము జూచి పూజాసమయాతిక్రమణమునకు వెరచి వానిని విమర్శింపకుండ నందేతెంచితిమి. ఆ బాలకుఁ డెట్లిచ్చటకు రాగలిగెనో వాఁడెవ్వడో తెలిసికొనవలసి యున్నదని పలుకుటయు నా ధాత్రీకళత్రుండు సంభ్రమముగా నిట్లనియె.

ప్రియురాలా! యక్షలోకమునుండి మా శబరబాలకుండు మందసముం గైకొని యెందో పారిపోయెనని నాతో భైరవీదేవి యానతిచ్చియుండెను. వాఁ డిచ్చటకు వచ్చియుండెనేమో విమర్శింపవలయును వైళమ నీవిప్పుడు చెప్పినవాఁ డున్నచోటు చూపించుమని తొందరపెట్టుటయు నా యోషిల్లలామ మేము జూచినవానికి మీరు వచించిన శబరబాలక లక్షణములుండుట నిక్కమని పలుకుచు నప్పుడే తక్కినవారితో నద్దివోదాసుని బాణిద్వారమున నుద్యానమునకుఁ గొనిపోయెను. కాని యా బాలకుండు వారికి గనఁబడలేదు. వాఁడందెందేని ముందున్న వాడేమో యని యా ప్రాంతమంతయు వెదకిరి. గాని వానిజాడ యెందును గనంబడినది కాదు.

ఇంతలోఁ బ్రాంతమందున్న మందిరమునందుండి యెవ్వరో బాధచే మూల్గు చున్నట్లు వినంబడుటయు వారందఱు నివ్వెరపడుచు సత్వరమ యందుఁ బ్రవేశించి నలుమూలలు విమర్శింపఁదొడంగిరి. అందేమియు వారికిఁ గనఁబడలేదు. కాని యా మూల్గు వారికి మిక్కిలి దాపుననే వినవచ్చుచుండెను. ఆ ధ్వని ననుకరించి వెదకు చుండ వారికొక యంతర్గృహమందుఁ గ్రిందనుండి యది వినఁబడుచుండుటఁ దోచెను.