పుట:కాశీమజిలీకథలు-12.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవతాస్త్రీల కథ

75

యమాయకురాండ్రగు నీజవరాండ్ర నాపదపాలు జేసెను కానిమ్ము. శాపాంతమగువఱకు బ్రహ్మరాక్షసత్వము వీరికి దినమునకు యామద్వయము మాత్రమే యుండగలదు. అదియును నర్దరాత్రమునుండియే ప్రారంభమగుచుండును. ఉదయమునుండి శాప దోషము దగులువరకు వీరు నల్వురు నొక్కచోటనే యుండి యుల్లాసముగా గాలము గడుప గలవారలు. శీతశైలంబున గల కాంచనశిఖరము గడు పవిత్రమైనది. అందున్న శాంభవీదేవి యాలయమే వీరికి నిలయమై సర్వభోగభాగ్యముల సమకూర్చగలదు. ఆ శిఖరము జేరువరకు వీరికి శాపదోషం బంటనేరదు. పుడమియందున్నను స్వర్గ సుఖంబుల మరపించు సంతోషైశ్వర్యముల నందగలరని మమ్మనుగ్రహించెను. అందున్నవారెల్లరును వాని మాటల కానందించిరి. దేవేంద్రుడు సభ నంతటితో ముగించి యంతర్గృహమున కేగెను.

పిమ్మట మేము వాడిన మోములతో, గందిన హృదయములతో నా దేవ సభాభవనము వెడలివచ్చి చేసిన యవజ్ఞతకు వగచుచు స్వర్గలోకము నతికష్టమున విడచి యిక్కాంచన శిఖరమున కేతెంచితిమి. ఈ శాంభవీదేవిని దర్శించి దినమంతయు నీమె సన్నిధానమందు గడపితిమి. నాటి రాత్రి రెండుయామము లగునప్పటికి మమ్ము గురుశాపమలమికొని పూర్వాపు విజ్ఞానమంతయువిస్మృతి గలుగజేసినది వెంటనే తల యొక దిక్కునకు బోయి యిచ్చటకు గ్రోశద్వయ పరిమాణమున నున్న మహారణ్య ములో శాఖాగ్రముల నాశ్రయించికొనియుండ తెల్లవారువరకు సంగీత కాలక్షేపము జేసితిమి. ఉదయమగువరకే మా శాపదోషంబున దీరుటచే దిరుగ నిచ్చటి కేతెంచి యమ్మవారిని దర్శింపగల్గితిమి. ఇట్లే యమ్మహారణ్యంబున బ్రతిదినము నర్ధరాత్రము నుండి గానకళావైదుష్యము బ్రకటించుచు బిదప బూర్వపు రూపములంబూని యీ యమ్మవారి నతిభక్తి శ్రద్ధలతో బూజించుచు బెక్కు సంవత్సరములు గడిపితిమి. పిశాచరూపంబుల నున్నప్పుడు మాకు గానవిద్య మాత్రము స్ఫురణయందుండి సర్వదా ప్రకటింపబడుచుండునది. శాపమావహించుటే తడవుగ మమ్మిందుండి యే మహాశక్తి వృక్షాగ్రముల దృటిలో జేర్చుచుండెనో వచింపజాలనుగాని యుదయమున నటనుండి యీ ప్రదేశమున కేతెంచుట మాకతికష్టతమముగ నుండునది ఈ శాంభవీ దేవి భక్తలోకైకకల్పకంబు. నిత్యము నీమె యారాధన మీ రూపమున మాకు లభిం చుటంజేసి చరితార్ధులమైతిమి. ఈ దేవి మా ప్రార్థనల కలరి మమ్మెల్లప్పుడును గాపాడుచుండెను. ఈమె యనుగ్రహాతిరేకంబుననే‌ మా‌కు సర్వసౌఖ్యములు లభింప గలవని యాసించుచున్నాము. నాలుగు దినములనుండి శాపదోషం బొకటొకటిగా గ్రమంబున నిన్నటితో మా నల్వురకు నేపుణ్యాత్ముల మూలంబుననో విడిచిపోయినది. నేడిందు దేవరదర్శనం బబ్బుటచే మేమెంతయును ధన్యాత్ములమైతిమి. ఇందు మిగుల వెలగల రత్నములు గుప్పతిప్పలై యున్నవి. మమ్ము బరిణయంబాడు పురుష సింహుడే యీ యైశ్వర్యమున కంతకు నధికారి యని యమ్మవారు సెలవొసంగెను.