పుట:కాశీమజిలీకథలు-12.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఇంతలో నయ్యమ్మవారి విగ్రహము వెనుకనుండి యొకసుందర పురుష ప్రవరుండు బటురయమున ముందుకు వచ్చి యా యచ్చర మచ్చకంఠులతో నిట్లనియె.


ఉ. ఓ సుమకోమలాంగవిభవోజ్వలులార ! మనంబులం దింకన్‌
    గాసిలనేల ? మీకొఱకె గావలయున్‌జుమ యమ్మవారు న
    న్నీసదనంబు జేర్చికొనియెన్‌, వినుతింపగా నొప్పుగాదె వి
    శ్వాసముతోడ నీమె ననివంబును భక్తసురద్రుమంబుగాన్‌.

చ. నరుడనెగాదు నేను నరనాధుడ దివ్యబలప్రతాప భా
    స్వరుడ మిమున్‌ గ్రహింప మది సమ్మతినందితి మీరుభక్తి నీ
    శ్వరి కొనరింప గల్గిన సపర్యలు సత్ఫల మందఁ గల్గె ను
    ర్వర నసమానసౌఖ్యముల భాసిలగాఁ గల రింక మీఱటన్‌.

ఆ పలుకుల కా కలికి తలమిన్న లలరుచు వాని యాగమమున కక్కు జం పడుచు నా పురుషుని రూపరేఖా విలాసములకు వింతపడుచు నమ్మవారి భక్తవత్సలత్వ మును వినుతించుచు దమభాగధేయము ఫలించెనని సంతసించుచు శృంగారవిలోకనముల నా సుందరాంగునిపై బరగించుచు గొండొకవడి లజ్జావనితవదనలై యేమియుం బలుక జాలకుండిరి.

అంత నా పురుషశ్రేష్టుండు విలాసదృష్టుల నా యోషామణులపై బర పుచు మందహాసము మొగమునకు నూత్నవికాసం బొనగూర్ప మృదుమధుర భావణ ముల నా మత్తకాశనుల చిత్తములు నిజాయుత్తము లగునట్లు జేసికొనెను. పిమ్మట వారిట్లు సంభాషించుకొనిరి.

పురుషుడు - .కాంతామణులారా ! మీ యుదంతంబంతయు వినవలయు నని నా యంతరంగం బుత్సహించుచున్నది మీ రెవరు! ఈ నిర్జనారణ్యమధ్యమున కెట్లు రాగలిగితిరి. శాపదోషము దీరిపోయెనని యంటిరి. అదెట్లు సంభవించి దొలం గెను ?

మదనమంజరి - పురుషప్రవరా ! మీకువలె మాకుగూడ మీ వృత్తాంతం బెరుంగ దలంపు గలిగియున్నది. మనుష్య సంచారానర్హంబగు నీకాంచన శిఖరమునకు మీరెట్లు రాగలిగితిరో మాకు వింత గొల్పుచున్నది వినదగుదుమేని తొలుత మీ యుదంతం బెరింగించి మమ్ము గృతార్దులం జేయుడని ప్రార్ధించుచున్నాను.

పురు -- నా యుదంత మెరింగించియే మిమ్మడుగుట ధర్మము. నేసు ధరణి చక్రం బేకఛత్రముగా బరిపాలించు దివోదాసుడను పార్దివేంద్రుండను. శబరబాలక ప్రేతాన్వేషణ నెపమున యక్షలోకమున కేగి యందు వాడు సజీవుడయి వెడలిపోవుట