పుట:కాశీమజిలీకథలు-12.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవతాస్త్రీల కథ

73

విని వానిని వెదకికొనుచు దిరిగితిరిగి నేటికిచ్చటి కేతించి మిమ్ముంగంటినని వృత్తాంత మంతయు గ్లుప్తముగా వారి కెరిగించి వారి యుదంతము దెలిసికొనగోరెను.

విద్యు -- (జనాంతికముగా) సఖీ! తటిత్ప్రభా ! ఆర్యపుత్రుని ప్రభావం బమానుషముగను నాశ్చర్యకరముగను నున్నది. మన యుదంతం బెరింగిన వీనికి మనయం దనురాగము గొఱతపడునేమో యని భీతి గలుగుచున్నది.

తటి - ఈ యనఘుడు దన హృదయమున మన కిదివరికే యవకాశ మొసంగి యున్న కతమున నట్టి సంశయమునకు బనిలేదు. ఇదియునుంగాక పురుషులు నూతనప్రియులగుట నీషద్దోషముల నెన్నజాలరు గదా.

హేమలత - సఖులారా ! మనోహరునకు మనకథ నెరిగింపక కాలయాపన మొనరించెద రేమిటికి.

విద్యు -- మనయందరిలోను మాట పొందికగల మదనమంజరి నిందులకు నియోగింతము.

తటి -- సఖీ ! మదనమంజరీ ! ప్రాణేశ్వరునకు విసుగు బుట్టకుండ మన యుదంతంబెల్ల వేగ మెరింగించి వాని మన్ననలకు బాత్రురాలవు గమ్ము.

మద -- [దివోదాసునితో] ఆర్యపుత్రా ! మేము నలువురమును స్వర్గలోక మందుండు దేవకన్యలము. సంగీతవిద్య మేము తుంబురునొద్ద బరిశ్రమ జేసితిమి. అప్పటినుండియు మాకు చెలిమి యెక్కువయై క్రమముగా నాహార శయ్యా విహా రాదులయం దొక్క నిముసమైన నొకరి నొకరు విడచి యుండజాలక యేకదేహమట్లు మెలంగుచుంటిమి. మా గురువర్యుని యుపదేశ విశేషమున గానవిద్యయం దనవద్య పాండిత్యము మా కబ్చి దివిజలోకములందు మిగుల ప్రఖ్యాతి గాంచియుంటిమి. మా సంగీతవిద్యాప్రౌఢిమకు మెచ్చి బిడౌజుండు మా కనేక యోగ్యతా పత్రికల నొసంగి యుండెను. ఒకప్పుడు మా గురువు తుంబురునకును, నారదునకును సంగీతవిద్యా విషయమై వివాదము సంప్రాప్తమయ్యెను. వారి తారతమ్యము విమర్శించి యా విద్యయం దధికులెవ్వరో నిర్ధారణ చేయుటకు పాకశాసనుని వారు గోరుకొనిరి గాన కళాకౌశల్యమున బేరుకెక్కి యున్న మమ్ము నల్వురను సహాయసంఘముగ నేర్చరచు కొని దేవేంద్రుండు సుధర్మాభవనంబున గొప్ప సంగీతసభ జేసెను. అందు దుంబుర నారదులు దమ విద్యావైశద్యమును బ్రదర్శించిరి. అందు గాయకోత్తముడు నారదుం డనియు, వైణికశ్రేష్టుండు దుంబురుండనియును శాస్త్రానుభవ మిరువురకు సమాన మనియును మేమేకాభిప్రాయ మొసంగితిమి. దేవతావల్ల భుండును మా యభిప్రాయ ముతో నేకీభవించి జంత్రగాత్రములయందు గాత్రమే సర్వలోక ప్రమోదావహంబని యుపన్యసించుచు గాయకశ్రేష్టుడగు నారదునకు దివ్యరత్నహార మొండు బసదనముగ నొసంగి మిగుల గౌరవించెను.