పుట:కాశీమజిలీకథలు-12.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవతాస్త్రీల కథ

71

భక్తసులభ యగు నా యంబికాదేవి వారికి బ్రత్యక్షమై, బిడ్డలారా ! మీ యాపద కొలఁది దినములలోఁ దీరఁగలదు. మీకు దివ్యప్రభావసంపన్నుఁడగు నరకంఠీ రవుండు యొడయం డగును. అనతి కాలముననే మీకు సర్వభద్రములు జేకూరఁ గలవు ఇచ్చటఁగల రత్నరాసుల కన్నింటికిని మిమ్ము జేపట్టు పురుషుఁడే యధికారి యగును. భర్తృసమాగమం బగువరకు మీరిచ్చటనే యుండవలయునని పలికి యంత ర్హితురాలయ్యెను.

ఆ దేవి పలుకులకు వారెల్లఁ గులుకుచుఁ దమ నలువురకు నొక్కఁడే పతి యని నిశ్చయించుకొని యం దొకతె యెవ్వరినైనఁ బతిగాఁ వరించినచోఁ దక్కినవారు గూడ వారినే విభునిగా గ్రహింపవలయు నని వారప్పుడే బాస జేసికొనిరి.

పిమ్మటఁ గొన్నిదినముల కొకొనాఁడు వారు రాత్రి చాల గడచువరకు నా దేవీమండపమునఁ గీర్తనలం బాడుకొనుచుండ నందు మువ్వురు మాత్రమే వాడుక ప్రకార మెచ్చటకోఁ బోయిరి. హేమలత యను నచ్చర యచ్చటనే యుండి యుదయ మగుసరికి తక్కినవారిం గలుసుకొనెప. మరునాటి రాత్రి యిరువురు మాత్రమే వెడలి పోయిరి. హేమలతతోఁ దటిత్ప్రభ యారాత్రిశేష మా మండపము మీదనే గడి పెను. మూఁడవనాఁడొక్కతె మాత్రమే యరిగినది విద్యున్యాలయను నచ్చరలేమకూడ యం దుండిపోయెను. నాలుగవ దినంబున మదనమంజరి కూడ తెల్లవారు దనుక నమ్మండ పమునందే తక్కిన చెలికత్తెలతోఁ గాలక్షేప మొనరింపఁ గలిగెను.

వాడుకప్రకార మర్ధరాత్రమునఁ దలయొక దారింబోక యచ్చటనే యుండఁ గల్గుటకు వారానందించుచుఁ దమ శాప మే మహానుభావునివలననో తీరెనని యుబ్బుచు నాడబ్బోకవతులాదివసమున నత్యుద్సాహంబుతోఁ దటాకమున జలకములాడి నయ్యమ్మవారిని బూజించుటకుఁ బుష్ఫములఁ గొనివచ్చుచు దారిలోఁ బేటికాహస్తుండగు మనుష్య యువకుంజూచి శంకించి పూజాసమయ మతిక్రమించునను భయమున వాని విమర్శింపకుండ నమ్మవారి యాలయమునకుఁ బోయిరి.

అందా సుందరీమణులు శాంభవీదేవిని యధావిధిఁ బూజించి భక్తితత్పరలై చేతులు జోడించికొని యమ్మవారి యెదుర నిలచి యిట్లు స్తుతించిరి.


మ. జననీ ! నీదయచేత నిప్పటికి మా శాపాతిదోషం బదె
     ల్లనడంగెన్ నశియించె బాధల మహోల్లాసము సేకూరె ని
     న్ననయంబున్‌ మదినమ్మి గొల్చిన ఫలం బబ్బంగ మమ్మింకిటన్‌
     అనురూపుండగు ప్రాణనాయకునితో నమ్మా ! వడిన్‌ గూర్పుమా.

చ. మనుజుఁడె మీవిభుండగు జుమా యని నీవిటఁ బ్రేమ నానతి
    చ్చినవిధమెల్ల మాహృదయసీమల గాటము గాఁగ నాటియుం
    డెను గద యట్టిఁ దెన్నఁడు ఘటించునొకోయని యాత్రమందుమా
    మనముల నూరడింపఁగల మాటలఁ దెల్పఁగదమ్మ యమ్మరో ?