పుట:కాశీమజిలీకథలు-12.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

హేమ -- సఖులారా ! శాంభవీదేవి నర్చించుటకు కాల మతిక్రమించు చున్నది. ముందాపని నిర్వర్తించుకొని వచ్చిన పిదప వీని విషయమై యాలోచించు కొనవచ్చును. ఇంతలో వీఁడెక్కడకుబోగలడు.

ఇట్లు వారు సంభాషించుకొని యమ్మవారి నర్చించుట కతి జవంబున నా గుడిలోనికిఁ బోయిరి. శబర బాలకుండు వారిం జూచినప్పటి నుండియు నివ్వెరపాటున మైమరచియుండెను. అట్టి యద్భుత లావణ్యముగల యలివేణుల నెన్నఁడును గనివిని యెఱుఁగని కారణమున వానికి వారి దర్శనము వింతఁగొల్పుట యబ్బురముగాదు. ఆ యంగనామణులు గుడిలోనికిఁ బోయినతోడనే వాఁడును వెనుకకుఁ దిరిగి గుడి యొద్దకు వచ్చి వెనుకటి ద్వారమునఁగాక మఱొక దానివెంట నా యాలయమును బ్రవే శించెను.


314 వ మజిలీ

దేవతా స్త్రీలకథ

హిమవన్న గరమునఁ గాంచనకూట మను శిఖరము మిగుల నెత్తైనది దానిని మనుష్యు లెవ్వరును జూచి యెరుంగరు సరేకదా యట్టి శిఖర మున్నదనియైన నెవ్వ రును వినియుండలేదు. పూర్వమొక యక్షుండు సంతాన మపేక్షించి యందు శాంభవీ దేవికి స్వర్ణమయ దేవాయతనంబు గట్టించి నవరత్నములతో నిత్యము నర్చించుచుఁ గొంతకాలమునకుఁ దన యభీష్టము బడయఁగలిగెను. ఆ యక్షునిచేఁ బూజ సేయఁ బడిన రత్నములతో నా యాలయప్రదేశమంతయు నిండిపోయెను. పిదపఁ గొంత కాలమునకు నల్వురు దేవతాస్త్రీలా యాలయంబున కేతెంచి రత్నకాసులెల్లఁ బ్రోవు సేసి యందొక భాగమున భద్రపరచిరి. కొన్ని యనర్ఘరత్నముల గర్భాగారము నందును నితర ముఖ్యప్రదేశములయందును నందముగా నమరించి యా యమ్మవారిని నిత్యమును బూజించుచుండిరి. ఆ గుడివెనుక నొక రమణీయోపవనము నిర్మించి యందు పూజార్హ ములగు వివిధ కుసుమ జాతులఁ బెంచుచుండరి. ప్రతిదినము మూడు వేళలయందును జేరువనున్న పద్మాకరంబున జలకములాడి వచ్చి యా యుద్యానవన ముననున్న పుష్పములఁ గోసి తెచ్చి‌ యా యమ్మవారి నధిక భక్తితోఁ బూజించు చుండిరి. రాత్రి ప్రొద్దుపోవువఱకు నా దేవీమండపమున భజనకీర్తనలం బాడుచుఁ బిమ్మట నల్వురు దల‌యొకదారిం బోయి యుదయమున కక్కడ చేరుకొనుచుందురు. ఇట్లు కొన్నియేండ్లు గడచిన పిమ్మట నొకనాఁటి యుదయమున వా రతిభక్తి నయ్యమ్మవారిం బూజించి తమ యిక్కట్టుఁ బాపి శీఘ్రమ యనుకూలవాల్లభ్యము గలుగునట్లనుగ్రహింపుమని ప్రార్థించిరి.