పుట:కాశీమజిలీకథలు-12.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబరబాలకుని కథ

69

విద్యున్మాల - పేటికాహస్తుఁడై మనలఁ దదేకదృష్టిం గాంచుచున్న వీఁ డెద్దియో పాపఁపుటూహతో నున్నట్లు తోచుచున్నది.

తటిత్ప్రభ --- పాపఁపుటూహ లేకున్న మందసముం గొనిరాఁగతంబేమి యుండును. ఇచ్చోటఁగల యనర్ఘమణుల మ్రుచ్చిలించి యమ్మందసము నింపుకొని పోవలయునను తలంపున వీఁడిచ్చటి కెట్లో చేరఁగలిగియుండును.

మదనమంజరి -- సఖులారా! వీని చూపులం దిలకింప మన రూపముల నాశించి యున్నట్లు దోచుచున్నదిగదా ?

హేమలత - [మందహాసముతో] తన యందమునకు మనలఁబోలు రూప వతులు గావలయుఁ గాఁబోలును.

తటి - రూపము నాశించువానికి మందసమేటికే ?

విద్యు - మనుజబాలకునకు సౌరనారీ సహవాస యోగ్యత యెట్లు గలుగును.

హేమ - మనమందరకుఁ గూడ మనుష్యుఁడే యొడయుఁడగు నని యమ్మ వారి యాజ్ఞయైనదిగదా ?

మదన - అమ్మవారి యాజ్ఞయయ్యెనని యీ కురూపిని వరింతమందువా యేమి?

హేమ --- వీఁడు గాకున్న మరొక్కఁడైన మనుజుఁడే మనకు బతికావలసి యున్నదని నా యభిప్రాయము.

విద్యు -- మనము నల్వురము గూడ ననుకూలుఁడగు పతినొక్కనినే వరించుటకు నియమము జేసికొంటి మెరుంగుదురా?

మదన - ఆ నియమ మెన్నఁడును దప్పగూడదు. మనలో నెవ్వతెయైన నొకనిని వరించియున్నప్పుడు తక్కినవారికిఁ గూడ వాఁడే యొడయుఁడగును. ఈ యువకునందు మనలో నెవతెకైన ననురాగము గలిగియుండినఁ జెప్పవచ్చును.

అందరును - ఛీ! ఛీ! [అని అసహ్యించుకొందురు]

మదన -- భక్తులపాలిటి పారిజాతమన నొప్పు నియ్యమ్మవారు యోగ్యుఁ డగు పురుషసింహుఁడు మనకు భర్తగావలయునని దలంచునుగాని యిట్టి నీచునిఁ గట్టి పెట్టవలయునని జూడదుగదా?

తటి - అడవులంబడి తిరుగు కిరాతజాతివాఁడని వీనింజూచిన దెలియుట లేదా? ఇట్టి వానికై మీరింత తర్కించుకొనుటఁజూడ నాకు నవ్వువచ్చుచున్నది. వీడు తప్పక యందలి రత్నముల నపహరింప వచ్చినవాఁడు గాని మరొకటికాదు.

విద్యు -- మన మదనమంజరి వీనియందు లేని రసికత నిరూపించినదిగాని నీవు చెప్పినదే నిజము. వాని చూపులయందు మూఢత్వము దేటపడుచుండెనేగాని విలాసవిశేష మింతయును లేదు.

తటి -- ఏది యెట్లున్నను వీఁడిక్కడకు రాఁగలుగుట వింతగా నున్నది.