పుట:కాశీమజిలీకథలు-12.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

సువర్ణ మణిమయ గోపురప్రాకారాదులచే నద్దేవతాయతనము గన్నులకు మిరుమిట్లు గొలుపుచుండెను. మహారణ్యమధ్యమున నట్టిదివ్యాలయముండుట కచ్చెరువువడుచుఁ దొందరగా వాఁడు ముం దరిగి తృటిలో దానిని సమీపింపఁ గలిగెను.

ఆ గుడి తలుపులు తీసియున్న కతమున లోనికి నిరాటంకముగఁ బోయెను. ప్రాకారమధ్యముననున్న శుద్ధస్వర్ణవినిర్మితంబగు దేవతాగారమునుజూచి భయవినయ విస్మయములతోఁ బ్రదక్షణములొనరించి తెంపున గర్భాగారముం బ్రవేశించెను. అందు దివ్యప్రభావమునఁ దేజరిల్లు యంబికావిగ్రహము గనంబడినది. మణిదీపికలచే నాగర్భా లయమంతయు విస్పష్టముగఁ గనంబడుచున్నది. మన వనాటబాలకుఁడు మందసమును నేలఁబెట్టి యాయమ్మవారి కభిముఖుండై చేతులు జోడించుకొని యచ్చంపుభక్తి నా దేవిని బెద్దగా స్తుతించుచు నాపదలకాకరంబగు నయ్యరణ్యమునుండి దాను శీఘ్రమ యవులం బడుటకు వెరవుజూపుమని కోరుకొనెను. ఇంతలోఁ బ్రాంతమందు సంగీత ధ్వని వినంబడినది ఇదివరలోఁ దానువిన్నగానము దిరుగనందు వినంబడుటచేఁ జకి తుఁడై యందుండుటకు వెరచి మందసము గైకొని పరుగుపరుగునఁ దాణిద్వారమున నావలకుఁబోయెను. అచ్చటమిగుల రమణీయమగు నుద్యానము నేత్రపర్వమొనర్చెను. అందొకవైపునకుఁ బోవముందతిసుందరమగు మందిరమొండు గనంబడినది. దాని దాపున నున్న పుష్పవనమునందు యధేచ్చగా సంగీతము పాడుకొనుచు నల్వురు సుందరాంగులు పుష్పాపచయం బొనరించుచుండిరి. వారి సంగీతము దా నిదినవరకు నాలుగురాత్రులు విన్నగానము పోలికగానే యుండెను. వారి యాకారములు దానంతకు ముందు గాసారతీరమునఁ జూచిన యోషిల్ల లామల తీరునే తోపింపఁ జేయుచుండెను. అప్పుడు శబరబాలకునకు ముందేగుటకు వెనుకకు దిరుగుటకు మనంబొప్పదయ్యెను. రాత్రులయందు వృక్షాగ్రముల నివసించి మహారణ్యమధ్యమున గానమొనరించుట పిశాచలక్షణమని నమ్మి ముందేగిన స్త్రీ రూపమున నున్న నా భూతములు దన్ను విరచుకొని తినునేమో యను భయముగలిగె. అనన్యరూపలావణ్యముల డంబుమీరి యున్న యా యన్నుమిన్నల వారి విలాసవిశేషములఁ గన్నులారఁ జూడకుండ వెనుకకుఁ దిరిగిపోవుటకు మనంబొప్పకుండెను. ఇట్లు కొంతతడ వేమిచేయుటకుం దోచక యతం డచ్చటనే నిలువంబడి యాచేడియల చేష్టిలతంబుల గమనింపుచుండెను.

ఇంతలోఁ బువ్వులగోయుటఁ జాలించి యా మించుఁబోణులు దేవీపూజా సమయంబయ్యెనని పటురయమున నా గుడివైపున కేతెంచుచుఁ బేటికాహస్తుఁడై మార్గ మందు నిలువఁబడి తదేకదృష్టిగాఁ దమ్మీక్షించుచున్న యా యమాయకపు బాలకునిఁ గాంచి విస్మయావేశహృదయలై యిట్లు వితర్కించుకొనిరి.

హేమలత - సఖీ! విద్యున్మాలా ! మానవులకుఁ జేరరాని యీ కాంచన శిఖరాగ్రమున నున్న యంబికాయతనమున కీ నరబాలకుం డెట్లు రాఁగలిగెనే ?